Jagan Political Setback: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) గట్టి షాక్ తగిలింది. సొంత నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాలేదు. పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి లతా రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైసిపి అభ్యర్థి హేమంత్ రెడ్డి పై 6,035 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన డిపాజిట్ గల్లంతయింది.
రికార్డు స్థాయి మెజారిటీ..
ఒంటిమిట్ట ( vontimitta )జడ్పిటిసి స్థానాన్ని సైతం తెలుగుదేశం కైవసం చేసుకుంది. టిడిపి అభ్యర్థి ముద్దుకృష్ణ రెడ్డి ఘన విజయం సాధించారు. ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్థి సుబ్బారెడ్డికి కేవలం 6513 ఓట్లు లభించాయి. దీంతో టిడిపి అభ్యర్థి కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో ఘనవిజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే దశాబ్దాల తర్వాత పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారని టిడిపి చెపుతోంది. పులివెందుల జడ్పిటిసిగా గెలిచిన లతారెడ్డి మంత్రి సవితను కలిసారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని మంత్రి స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందే పులివెందులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు.
Also Read: కుప్పం లెక్కను పులివెందులలో సరిచేసిన బాబు!
30 ఏళ్ల తర్వాత ఓటింగుకు..
అయితే పులివెందుల ఎన్నికకు సంబంధించి కౌంటింగ్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. నిన్న రీ పోలింగ్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఈరోజు కౌంటింగ్ సైతం గైర్హాజరయింది. దీంతో జాతీయ పార్టీల నుంచి బరిలో దిగిన వారితో పాటు ఇండిపెండెంట్లు, టిడిపి అభ్యర్థి మాత్రమే కౌంటింగ్ కేంద్రంలో ఉన్నారు. అయితే పులివెందులకు సంబంధించి 25 ఓట్లను ఒక కట్టగా కట్టేటప్పుడు.. అందులో నుంచి ఓ స్లిప్ బయటపడింది. ఓ అజ్ఞాత వ్యక్తి దాన్ని రాసి బ్యాలెట్ బాక్స్ లో వేశాడు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేసేందుకు సంతోషంగా ఉందని అందులో రాసుకోచ్చాడు. అయితే దశాబ్దాల కాలంగా పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రజలకు తెలియదు. తొలిసారి చాలామంది ఓటు వేసేసరికి భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే వైయస్సార్ కుటుంబానికి అడ్డగా ఉన్న కడప జిల్లాలో, పులివెందుల నియోజకవర్గంలో గట్టి షాక్ తగిలింది.