AP Cargo Airport : ఏపీలో( Andhra Pradesh) కొత్తగా మరో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగనుంది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా ప్రకటించారు. వెనుకబడిన జిల్లాగా శ్రీకాకుళం పై ఒక ముద్ర ఉంది. దానిని రూపుమాపేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు రాజాగా ప్రకటించారు. పలాస నియోజకవర్గంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతామని చెప్పుకొచ్చారు. అపోహలు విడిచిపెట్టి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే ఇన్స్టిట్యూట్లో ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రజలనుంచి అభిప్రాయాలను సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణకు పలాస నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు తో పాటు మంత్రి కింజరాపు అచ్చెనాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు.
* ప్రజాభిప్రాయ సేకరణ..
పలాస( Palasa) నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గత కొద్ది రోజులుగా ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ప్రధానంగా మందస, వజ్రపు కొత్తూరు మండలాల సరిహద్దు ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మాణం చేసేందుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు గాను ఈ సమావేశం నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పరిహారంతో పాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో మందస, వజ్రపు కొత్తూరు మండలాల రైతులు విమానాశ్రయ నిర్మాణానికి మద్దతు తెలిపారు. అయితే తమను ఎలా ఆదుకుంటారో చెప్పాలని వారు కోరారు. తమకు స్పష్టమైన హామీలు కావాలన్నారు. ప్రధానంగా బిడిమి, మెట్టూరు, చీపురుపల్లి, బేతాళపురం, లక్ష్మీపురం గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. భూమికి మంచి ధర ఇవ్వాలని.. స్థానికులకు ఉద్యోగాలు కావాలని.. భూమి కోల్పోయిన వారికి అదనపు సహాయం చేయాలని కోరారు. ఈ గ్రామంలో ఎంత భూమి అవసరం అవుతుందో స్పష్టంగా చెప్పాలన్నారు.
* మందస మండలం అనుకూలం..
మందస మండలంలో కార్గో ఎయిర్పోర్ట్ (cargo airport) నిర్మాణానికి అనువైన ప్రాంతం ఉందని ఇప్పటికే పౌరవిమానయాన శాఖ గుర్తించింది. దీనిపై నివేదిక ఇవ్వడంతోనే ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముందుకొచ్చినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పుకొచ్చారు. భూములు నష్టపోతున్న రైతులు వివరాలు తెలుసుకోవడానికి కొందరు అధికారులు వెళ్లారని.. కొంతమంది అడ్డుకోవడంతో వెనక్కి వచ్చేసిన విషయాన్ని గుర్తు చేశారు రామ్మోహన్ నాయుడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు లక్షల మందికి ఉపాధి దక్కుతుందని వివరించారు. అభివృద్ధి లేకుండా ఉద్యోగ అవకాశాలు ఎలా ఇస్తారో.. రైతులను రెచ్చగొట్టే వారిని ప్రశ్నించాలని సూచించారు. రైతులకు నష్టపరిహారం తో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఉద్దానం ప్రాంత అభివృద్ధికి ఇదో మంచి అవకాశం అని.. ప్రతి ఒక్కరూ సహకరించాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. మొత్తానికి అయితే పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఖాయమైనట్లు స్పష్టం అవుతుంది. దాదాపు మెజారిటీ ప్రజలకు కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నారు. దీనిపై ప్రజా సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.