Shreyas Iyer : టీమిండియాలో శ్రేయస్ అయ్యర్ ఈ కాలపు అద్భుతమైన ఆటగాడు.. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగలడు.. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అతడు బ్యాటింగ్ చేస్తాడు. చాప కింద నీరు లాగా విస్తరిస్తూ ప్రత్యర్థి జట్టుకు చేయాల్సిన నష్టం చేసేసి వెళ్లిపోతాడు. అందువల్లే ఈ కాలపు లెజెండరీ ఆటగాడని విశ్లేషకులు పిలుస్తుంటారు.. అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ అయ్యర్ కు జాతీయ జట్టులో చోటు లభించడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు అదరగొట్టినప్పటికీ.. ఆసియా కప్ లో అతడికి చోటు లభించలేదు. దీనిపై జాతీయ మీడియాలో రకరకాల విశ్లేషణలు జరిగాయి. జట్టు మేనేజ్మెంట్ ను అందరూ విమర్శించడం మొదలుపెట్టారు.
అయ్యర్ కు చోటు దక్కకపోవడం పట్ల ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటి పనేసర్ తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు. ” అయ్యర్ అద్భుతమైన ఆటగాడు. సూపర్ ఆట తీరుతో ఆకట్టుకుంటాడు.. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు అదరగొట్టాడు. ఐపీఎల్ లో కూడా పంజాబ్ జట్టుకు తిరుగులేని నాయకుడిగా వ్యవహరించాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. బహుశా అందువల్లే మేనేజ్మెంట్ అతడిని ఎంపిక చేయడం లేదు కావచ్చు. ఎందుకంటే అయ్యర్ సమర్థవంతమైన నాయకుడు. అతడిని మేనేజ్ చేయడం గంభీర్ కు ఇబ్బంది అవుతుంది. అతడి స్థానంలో ఒక యువ ఆటగాడికి చోటు కల్పిస్తే గంభీర్ పని సులభం అవుతుంది. అందువల్లే అయ్యర్ కు జట్టులో అవకాశం లభించడం లేదని” పనేసర్ పేర్కొన్నాడు.
అది భారత మేనేజ్మెంట్ బలం
“ప్రస్తుత కాలంలో క్రికెట్లో భారత జట్టు అద్భుతాలు సృష్టిస్తోంది . మేనేజ్మెంట్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జట్టును అన్ని విభాగాలలో అద్భుతంగా తీర్చి దిద్దుతోంది. క్రికెట్లో మూడు ఫార్మాట్లు ఉంటే.. అన్ని ఫార్మాట్లలో జట్లను తీర్చిదిద్దిన ఘనత మేనేజ్మెంట్ కు దక్కుతుంది. మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జట్టు అద్భుతంగా కనిపిస్తోంది. బహుశా ప్రపంచ క్రికెట్లో మూడు ఫార్మాట్ లలో గొప్ప ప్లేయర్లను సిద్ధం చేసిన ఘనత మేనేజ్మెంట్ కు దక్కుతుందని” పనేసర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు 2027లో జరిగే వరల్డ్ కప్ కు అయ్యర్ కు కీలక స్థానం లభిస్తుందని తెలుస్తోంది. అందువల్లే అతనికి ఆసియా కప్ లో చోటు కల్పించలేదని సమాచారం.