United Arab Emirates T20I Tri-Series 2025 : కొంతకాలంగా చెత్త క్రికెట్ ఆడుతూ అటు సొంత దేశ అభిమానులను.. ఇటు క్రికెట్ విశ్లేషణ సైతం తీవ్రమైన నిరాశలో ముంచుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. కాస్త గాడిలో పడ్డట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం యూఏఈ వేదికగా ట్రై సిరీస్ జరుగుతోంది. టి20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ సిరీస్లో మొత్తం ఆరు మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఆగస్టు 29 నుంచి ఈ సిరీస్ మొదలైంది. సెప్టెంబర్ 7న ముగుస్తుంది.
ఇప్పటివరకు పాకిస్తాన్ రెండు మ్యాచ్లు ఆడింది. ఆగస్టు 29న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. 39 పరుగుల తేడాతో గెలుపును దక్కించుకుంది. ఇదే ఊపులో ఆగస్టు 30న యూఏఈ తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. 31 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. తొలి మ్యాచ్లో సల్మాన్ ఆఘా హాఫ్ సెంచరీ తో కదం తొక్కాడు. రెండవ మ్యాచ్లో సయీం అయుబ్ అదరగొట్టాడు. ఇతడు కూడా హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.. మొత్తంగా చూస్తే గత కొంతకాలంగా దారుణమైన క్రికెట్ ఆడుతున్న పాకిస్తాన్.. ఈ ట్రై సిరీస్ లో మాత్రం అదరగొడుతోంది.
భారత్ జర జాగ్రత్త
యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ ట్రై సిరీస్ లో పాకిస్తాన్ అదరగొడుతున్న నేపథ్యంలో.. మన దేశ క్రికెట్ జట్టుకు మాజీ ఆటగాళ్లు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఆసియా కప్ యూఏఈ వేదికగానే జరగనుంది. టి20 ఫార్మేట్ లో ఈ సిరీస్ నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ఇక్కడి పిచ్ లపై తర్ఫీదు పొందడానికి ఈ సిరీస్ ను ఉపయోగించుకుంటున్నది. ఈ పిచ్ లపై అత్యంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తోంది. అందువల్లే భారత్ జాగ్రత్తగా ఉండాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే ఇదే వేదికపై ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజయం సాధించింది. ఏకంగా ట్రోఫీని సొంతం చేసుకుంది. భారత బ్యాటింగ్ ముందు.. బౌలింగ్ ముందు పాకిస్తాన్ నిలబడే అవకాశం లేకపోయినప్పటికీ.. ఏ క్షణమైన అద్భుతం జరగవచ్చని.. అలాంటి అవకాశం దాయాది జట్టుకు ఇవ్వకూడదని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేస్తే.. యూఏఈ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 207 పరుగులు చేసింది. బ్యాటింగ్ విషయంలో భీకరంగా కనిపిస్తున్న పాకిస్తాన్ జట్టు.. ఆసియా కప్ లో భారత్ కు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.