Shefali Verma: క్రికెట్లో ఏదైనా జరగొచ్చు. ఎప్పుడైనా జరగొచ్చు. అందువల్ల క్రికెట్ ను మాయాజాలమైన ఆట అని పిలుస్తుంటారు. ఎప్పుడు ఎవరు ఫామ్ లోకి వస్తారో.. ఎవరు విఫలమవుతారో చెప్పలేరు. కానీ కొంతమంది ప్లేయర్లకు ఫామ్ తో సంబంధం ఉండదు. పిచ్ తో సంబంధం ఉండదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లతో సంబంధం ఉండదు. వారు కేవలం ఆటను మాత్రమే నమ్ముకుంటారు. దురదృష్టం వెంటాడితే అవుట్ అవుతారు. కానీ మిగతా సందర్భాల్లో జట్టుకు అద్భుతమైన భరోసా కల్పిస్తారు. ఈ జాబితాలో షెఫాలీ వర్మ ముందు వరుసలో ఉంటుంది.
షెఫాలీ వర్మ ది హర్యానా రాష్ట్రం. ఇటీవల జరిగిన క్రికెట్ టోర్నీలలో ఆమె గాయపడింది. ఆ తర్వాత వరల్డ్ కప్ లో ఆడ లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె ఇక అసలు ఆడబోదని వార్తలు వినిపించాయి. అయితే అనూహ్యంగా ప్రతీక గాయపడి.. టోర్నీ మొత్తానికి దూరం కావడంతో ఊహించని విధంగా షెఫాలీవర్మకు అవకాశం లభించింది. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆమె ఆడింది.. ఓపెనర్ గా వచ్చిన తను బౌండరీలు కొట్టి కాస్త దూకుడు మీద కనిపించింది. కానీ ఆ తర్వాత ఆ జోరు 10 పరుగుల వద్ద ముగిసింది. దీంతో ఫైనల్ మ్యాచ్ లోకి తీసుకోవద్దని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. కానీ మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. తన మీద మేనేజ్మెంట్ ఉంచిన నమ్మకాన్ని ఆమె నిజం చేసి చూపించింది.
ఫైనల్ మ్యాచ్లో ఏకంగా 78 బంతుల్లో 87 పరుగులు చేసింది. ఇందులో ఏడు బౌండరీలు.. రెండు సిక్సర్లు ఉన్నాయి. వాస్తవానికి తను ఇంకా గొప్పగా ఆడేది. కానీ కండరాల నొప్పి వల్ల తీవ్రంగా ఇబ్బంది పడింది. నొప్పి తీవ్రంగా కావడంతో ఫిజియోల సహాయంతో థెరపీ చేయించుకుంది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేసినప్పటికీ జోరు కొనసాగించలేకపోయింది. దీంతో ఆమె ప్రస్థానం 87 పరుగుల వద్ద ఆగిపోయింది. వాస్తవానికి ఆమె జోరు చూస్తే చాలామంది సెంచరీ చేస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అవుట్ కావడంతో టీమ్ ఇండియా స్కోర్ బోర్డు వేగం మందగించింది. ఒకవేళ తన గనుక అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే టీమిండియా 300 మించి పరుగులు చేసేది.
షెఫాలీ వర్మ ఇటీవల గాయం నుంచి కోలుకుంది. అయితే ఆ గాయం తాలూకు ఇబ్బందులు ఆమెను వేధిస్తూనే ఉన్నాయి. చివరికి జట్టులోకి వచ్చిన తను.. స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంది. అంతేకాదు టాప్ స్కోరర్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో వర్మ చూపించిన దూకుడు వల్లే టీమిండియా ఆస్థాయిలో స్కోర్ చేసింది.