Conocarpus: ప్రభుత్వం నాటిన కోనో కార్పస్ మొక్కలు ప్రాణాంతకమైనవిగా మారాయట. ఈ మొక్కలను స్వయంగా అధికారులే హరితహారం సుందరీకరణ పేరుతో ఖమ్మం నగరంలో వాటిని నాటి పెంచారు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్ర లేచి..మంచి గాలిని పీలుస్తుంటారు అనే విషయం తెలిసిందే. అంతేకాదు జాగింగ్, వాకింగ్ లు అంటూ చేస్తుంటారు. కానీ ఈ కోనో కార్పస్ మొక్కల పుష్పాల నుంచి వచ్చే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ, ఆస్తమా వంటి సమస్యలు వస్తాయట.
పర్యావరణానికి ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేదట. కానీ దీని వల్ల దుష్ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఈ మొక్కలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఎత్తు పెరిగే ఈ మొక్కలను గతంలో అందం కోసం విదేశాల్లో పెంచేవారు. కానీ వీటి వల్ల జరిగే నష్టం తెలిసిన తర్వాత ఆయా దేశాలు నిషేధించాయి. 80 మీటర్ల వరకు వీటి వేర్లు వ్యాపించి భూగర్భ జలాలను పీల్చుతాయని చెబుతున్నారు నిపుణులు.
జీవకోటికి ప్రాణ హానీ తలపెట్టే ఈ మొక్కలను వేళ్లతో సహా తొలగించి పర్యావరణాన్ని కాపాడాలి అంటున్నారు పర్యావరణ ప్రియులు. శంకు రూపంలో పచ్చగా ఆకర్షణీయంగా కనిపించే ఈ మొక్కలు రహదారుల్లో రోడ్డుకు ఇరువైపుల ఎక్కువగా కనిపిస్తుంటాయి. పచ్చగా అందంగా ఉంటే ఈ చెట్లను నగరాలు అందంగా కనిపించేలా ఆదరించాయి కొన్ని దేశాలు. భారత్, అరబ్, మధ్య పాశ్చ దేశాల్లో ఈ మొక్కలను రహదారులు, గార్డెనింగ్ కమ్యూనిటీ లలో ఎక్కువగా పెంచారు. కానీ వీటి గురించి తెలిసి ఆయా ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి.
ఈ మొక్కలు హాని అని తెలియగానే ఆందోళన చెందుతున్నారు పర్యావరణ నిపుణులు. దీంతో ఈ మొక్కల పట్ల వ్యతిరేకత ప్రారంభం అయింది. అందువల్ల వీటిని నాటవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎంత చెప్పినా జిల్లా అధికారులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు ప్రజలు.