Sujana Chowdary
Sujana Chowdary: బిజెపి ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా అసెంబ్లీ జాబితాను వెల్లడించలేదు. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా సుజనా చౌదరి అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రిగా ఉంటూ ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన సుజనా చౌదరికి లోక్ సభ సీటు దక్కలేదు. ఆయనకు ఎంపీ టికెట్ దక్కకుండా పురందేశ్వరి పావులు కదిపారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. పక్క వ్యూహంతో చంద్రబాబు సుజనా చౌదరిని రంగంలోకి దించారని ప్రచారం జరుగుతోంది. ఆయనను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే.. విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోప్రభావం చూపుతారని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తప్పకుండా సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది.
వాస్తవానికి విజయవాడ పశ్చిమ సీటు జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. గత కొద్దిరోజులుగా జనసేన నేత పోతిన మహేష్ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేపడుతూ వస్తున్నారు. తప్పకుండా ఆయనకే టికెట్ అని ప్రచారం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి బుద్దా వెంకన్న తో పాటు చాలామంది నేతలు టిక్కెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా జనసేనకు కానీ.. బిజెపికి కానీ సీటు కేటాయించనుండడంతో ఆశావాహులు సైలెంట్ అయ్యారు. అయితే పొత్తులో భాగంగా జనసేనకు దక్కిన 24 అసెంబ్లీ సీట్లలో మూడింటిని వదులుకోవాల్సి వచ్చింది. అందులో ఒకటి విజయవాడ పశ్చిమగా తేలింది. దీంతో అక్కడ టికెట్ ఆశించిన జనసేన నేత పోతిన మహేష్ నిరాశకు గురయ్యారు. రకరకాల నిరసన కార్యక్రమాలు చేపట్టి హై కమాండ్ మనసు మార్చాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ అది వర్క్ అవుట్ అయ్యేలా లేదు.
విజయవాడ పశ్చిమ సీటు దాదాపు సుజనా చౌదరికి ఖరారైనట్టే. ఆయన పూర్వశ్రమంలో తెలుగుదేశం పార్టీ నేత. ప్రస్తుతం బిజెపిలో ఉన్న టిడిపి ప్రయోజనాల కోసం ఆరాటపడే నాయకుడు. తెలుగుదేశం పార్టీని బిజెపి దగ్గరకు చేర్చిన నేతల్లో ఆయన ఒకరు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి పదవి కూడా చేపట్టారు. ప్రస్తుతం విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆయన స్థానంలో తమ్ముడు చిన్నికి టిడిపి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు కృష్ణాజిల్లాకు చెందిన సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ సీటు కట్టబెడితే పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే జనసేన చేతిలో ఉన్న పశ్చిమ నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించారు. దీని వెనుక చంద్రబాబు వ్యూహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.