
ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం జాతీయ జలవనరుల శాఖ నిధులు విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు రూ.2,234 కోట్లను బదిలీ చేసింది. రాష్ట్రప్రభుత్వం చేసిన ఖర్చులను రీయంబర్స్ చేస్తూ ఈ నిధులను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.17,665 కోట్లు పోలవరం కోసం ఖర్చు చేయగా రూ. 10,741 కోట్లు రీయంబర్స్ చేసింది. తాజాగా ఎన్ డబ్ల్యూడీఏ పోలవరం ప్రాజెక్టు ఖాతాకు జమ చేసిన రూ.2,234 కోట్లు పోను మిగతా రూ.1787.88 కోట్లు రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈనెల 14న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సోమవారం ఉదయం 10.25 గంటలకు పోలవరానికి చేరుకొని ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం అధికారులతో సమీక్ష చేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.