Revanth Reddy 99 Day Action Plan : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక అలవాటుంది… ఏదైనా ప్లాన్ చేస్తే అది ‘అల్లాటప్పా’గా ఉండకూడదు. అందుకే ఇప్పుడు ‘‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’’ పేరుతో ఒక 99 రోజుల మారథాన్‌కు తెరలేపారు. 99 అంటే కేవలం అంకె కాదు… అధికారుల కొవ్వు కరిగించే ఒక ‘ట్రెడ్ మిల్’ అని సెక్రటేరియట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
విజన్ ఉందా? లేక వర్డ్ గజిబిజి ఉందా?
గతంలో ‘విజన్-2047’ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. పాపం, ఆ విజన్ ఎవరికీ కనిపించలేదు. ఎందుకంటే మన ఐఏఎస్ అధికారులు వాడే పడికట్టు పదాలు, ఇంగ్లీష్‌తో కలిపిన తెలుగు గందరగోళం చూసి సామాన్యుడికి ‘విజన్’ పోయి ‘కళ్లు బైర్లు’ కమ్మాయి. ఇప్పుడు ఈ 99 రోజుల ప్లాన్ కూడా అలాగే తయారైతే, జనం కంటే ముందు మీడియాకే ‘మెంటల్’ ఎక్కడం ఖాయం. కనీసం ఈసారైనా “సమ్మరీ” ఇవ్వకుండా, అసలు విషయం చెప్తారని ఆశిద్దాం!
పాత సీసాలో… కొత్త మిక్సీ జ్యూస్!
నిజానికి ఈ ప్రోగ్రామ్ ఎలా ఉందంటే… చంద్రబాబు కాలం నాటి ‘జన్మభూమి’, వైఎస్సార్ నాటి ‘ప్రజల వద్దకు పాలన’, ఆపై వచ్చిన ‘క్లీన్ అండ్ గ్రీన్’ అన్నింటినీ తీసుకెళ్లి మిక్సీలో వేసి పైన కాస్త ‘కాంగ్రెస్ మార్క్’ గ్యారెంటీలను చల్లి రేవంత్ రెడ్డి వడ్డిస్తున్న కొత్త కాక్టెయిల్ లాగా ఉంది. ఇంకా కేసీఆర్ హ్యాంగోవర్లో ఉండి, పాత ఫైళ్లను తడుముకుంటున్న అధికారులను తరిమి తరిమి జనం మధ్యకు పంపడమే దీని అసలు లక్ష్యం.
అసలు థ్రెట్ వారేనా..?
అయితే రేవంత్ రెడ్డికి అసలు శత్రువులు ఐఏఎస్ అధికారులు కాదు… అసలైన ‘డెంజరస్ బెల్ట్’ గ్రూప్-1 అధికారుల దగ్గరే ఉందనేది ఓపెన్ సీక్రెట్. ముఖ్యంగా కొందరు మహిళా అధికారులు ‘అవినీతి’లో పురుష పుంగవులను మించిపోయి, పైసల వాసన వస్తే తప్ప ఫైలు కదపడం లేదని టాక్. పాపం, ఏసీబీ కేసీఆర్ హయాంలో ‘దీర్ఘనిద్ర’లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు రేవంత్ ఆ నిద్రపోతున్న ఏసీబీకి కాస్త స్ట్రాంగ్ కాఫీ ఇచ్చి లేపి, ఈ ‘కలెక్షన్ కింగ్స్ అండ్ క్వీన్స్’ మీదకు వదులుతారా? లేక ‘పాపం రేవంత్’ అని అనిపించుకుంటారా? అన్నది చూడాలి.
రేవంత్ పర్సనల్ గోల్: “ఐ యామ్ ద బాస్!”
ఈ 99 రోజుల రచ్చ వెనుక రేవంత్ వ్యక్తిగత స్కెచ్ కూడా అదిరిపోయింది. హైకమాండ్ కోసం “తెలంగాణలో నేనే దిక్కు… నేనే మొక్కు” అని ఢిల్లీకి క్లారిటీ ఇవ్వడం… పనిలో పడితే అసంతృప్తి తగ్గుతుందని కొందరి నోళ్లు మూయించడం.2028లోనూ ‘చేయి’ దాటకూడదనే బలమైన పునాది వేయడం లక్ష్యంగా కనిపిస్తోంది.
బాటమ్ లైన్: టైటిల్ ‘ఆప్ట్’గా లేదు, లోగో ఇంకా తయారు కాలేదు… కానీ రేవంత్ మాత్రం గ్రౌండ్లోకి వెళ్తున్నారు. అధికారులు సిన్సియర్‌గా ఉరికితే ఓకే, లేదంటే వారు ‘ఉరి’ పడ్డట్టే అని హింట్ ఇచ్చేశారు. చూద్దాం… ఈ 99 రోజుల్లో జనం సమస్యలు తీరుతాయో లేక అధికారుల షూస్ అరిగిపోతాయో!