Ramoji Rao Eenadu history : రామోజీరావు.. తెలుగు మీడియా మొగల్ అని చాలామంది చెబుతుంటారు. తిట్టే వాళ్లు తిడుతుంటారు. మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు. తమకు జర్నలిజం విలువలు నేర్పారని.. తమకు బతుకునిచ్చారని ఈనాడులో పనిచేస్తున్న వారు అంటుంటారు. ఆయన పని రాక్షసుడని.. డబ్బు తప్ప దేనిని ప్రేమించరని.. ప్రతి దానిని వ్యాపార కోణంలో చూస్తుంటారని రామోజీరావు నచ్చని వారు అంటుంటారు.
రామోజీరావు ఇప్పుడు జీవించిలేరు. ఉన్నన్ని రోజులు తెల్లటి దుస్తులతో మెరిసిపోయేవారు. తన ఈనాడును చూసుకుంటూ మురిసిపోయేవారు. రామోజీరావు చివరి దశలో మినహా.. మిగతా కాలం మొత్తం చీఫ్ ఎడిటర్ గా ఆయన పేరు మాత్రమే ఉండేది. అయితే అంతకుముందు చీఫ్ ఎడిటర్ గా రామోజీరావు ఉండేవారు కాదట. రామోజీరావు ఈనాడు పత్రికను ప్రారంభించిన తొలి రోజుల్లో ఏబీకే ప్రసాద్ ఎడిటర్ గా ఉండేవారు.
ఏబీకే ప్రసాద్ కు క్షేత్రస్థాయి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందువల్లే ప్రతి వార్త విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకునేవారు. ఈనాడు అనతి కాలంలోనే ఆస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం ఏ బి కే ప్రసాద్.. ఏబీకే ప్రసాద్ ఆధ్వర్యంలో ఈనాడు విజయవంతంగా నడుస్తున్న సమయంలో రామోజీరావుకు.. ఒక ఆశ పుట్టింది. చీఫ్ ఎడిటర్ గా తన పేరును వేసుకోవాలని అనుకున్నారు. పైగా ఈనాడు తన పత్రిక.. తన ఇష్టం. ఏ బి కేకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారు. మరుసటి రోజు చీఫ్ ఎడిటర్ గా తన పేరు వేసుకోవడం మొదలుపెట్టారు. ఇది ఏబీకే ప్రసాద్ కు నచ్చలేదు. ఆ తర్వాత ఈనాడు నుంచి బయటికి వచ్చారు. రామోజీరావు క్రెడిట్ చోరీ ని చూస్తూ ఉండలేక మొహమాటం లేకుండా ఈనాడు కాంపౌండ్ నుంచి బయటికి వచ్చేసారు.
బయటికి వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ రూపకల్పనలో ఏబికే కృషి మామూలుది కాదు. నాటి రోజుల్లోనే ఆయన కలర్లో ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ను తీసుకొచ్చారు. అదే కాదు దాసరి నారాయణరావు ఉదయం పత్రికకు తొలి ఎడిటర్ గా కూడా ఏబీకే ప్రసాద్ పనిచేశారు.. నాడు ఉదయం పత్రికకు భిన్నమైన ట్యాగ్ లైన్ రూపొందించారు ఏబీకే. ప్రపంచంలో అందరికీ ఉదయం ఒక్కటే.. తెలుగు వాళ్లకు రెండు ఉదయాలు అనే ట్యాగ్ లైన్ రచించారు.
ఉదయం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆంధ్రభూమిలో ఆయన పని చేశారు. సొంతంగా పత్రిక ఏర్పాటు చేయాలని వార్త పేరుతో రిజిస్టర్ చేయించారు.. అయితే నాడు గిరీష్ సంగి కంపెనీలకు సంబంధించిన ఒక ప్రైవేట్ రోడ్డు మూతపడింది. ఆ పోరాటానికి బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి కర్త కర్మ క్రియ లాగా వ్యవహరించారు. నాడు ఇంద్రసేనారెడ్డి పోరాటాన్ని ఈనాడు గొప్పగా రాసింది. దీంతో గిరీష్ సంఘీకి తనకంటూ ఒక మీడియా కావాలి అనిపించింది.
అప్పట్లో హైదరాబాద్ లో నేషనల్ చెస్ ఛాంపియన్ పోటీ జరిగింది. దానికి గిరీష్ సంఘీ గ్రూప్ స్పాన్సర్ చేసింది. అయితే ఆ కంపెనీ పేరు రాయకుండా ఈనాడు వార్త రాసింది. ఇది గిరీష్ లో మరింత కోపాన్ని పెంచింది. ఆ తర్వాత ఆయన ఏబీకే ఆధ్వర్యంలో వార్తాపత్రికను తీసుకొచ్చారు. 1995లో ఈ పత్రిక తెలుగు ప్రింట్ మీడియాలో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఈనాడు.. వార్త మధ్య వైరం పెరిగిపోవడం.. వార్త యాజమాన్యానికి రకరకాల అవ లక్షణాలు ఉండడంతో.. క్రమంగా తన ప్రభను కోల్పోయింది. ఆంధ్రజ్యోతి మళ్ళీ రీ ఓపెన్ అయింది. ఈ లోగానే సాక్షి పుట్టింది. ఇక ఇప్పుడు ప్రింట్ మీడియా కొడిగట్టిన దీపం లాగా ఉంది..
