Rajasthan HPCL Tunnel Case: సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం కదా.. దొంగలు బ్యాంకులు కొట్టడానికి, లాకర్లు పగలగొట్టడానికి ప్లాన్లు వేస్తారు. గోతులు తవ్వుతారు, సొరంగాలు వేస్తారు… అలా జైపూర్ లో ఓ దొంగ కూడా అచ్చం అదే స్టైల్ ఫాలో అయ్యాడు. కానీ ఇక్కడ దొంగతనం చేసింది బ్యాంకునో, లాకర్లనో కాదు… ఏకంగా డీజిల్ పైప్‌లైన్‌కి కన్నం వేసి డీజిల్ దొంగతనం చేశాడు. రాజస్థాన్‌లోని జైపూర్ బగ్రూ ఏరియాలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఏం చేశాడంటే కిరాయికి తీసుకున్న ఒక ఇంట్లో ఏకంగా ఒక సొరంగం తవ్వి, దాని ద్వారా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) డీజిల్ పైప్‌లైన్‌కు కన్నం వేసి డీజిల్ దొంగిలించాడు. ఈ విషయాన్ని అధికారులు పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఒక వీడియో చూస్తే, ఆ కిరాయి ఇంట్లోని పరిస్థితి చాలా షాకింగ్‌గా ఉంది. ఒక రూమ్ ఫ్లోర్ కింద నుంచి రహస్యంగా సొరంగం తవ్వేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియో వైరల్ అవుతుంది. ఇందులో చూసిన విధంగా తవ్విన మట్టి, చెత్త చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక పెద్ద గొయ్యి నేల కిందకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. పక్కనే పైపులు, పనిముట్లు కూడా పడి ఉన్నాయి.
ఈ కేసులో రాజేష్ ఉరంగ్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇంకొంతమంది దొంగల కోసం వెతుకుతున్నారు. ఈ సొరంగం భూమి కింద దాదాపు 25 అడుగుల దూరం వరకు తవ్వారు. హెచ్‌పీసీఎల్ అధికారులు తమ పైప్‌లైన్‌లో ప్రెషర్ తగ్గిందని గుర్తించారు. డీజిల్ దొంగతనం జరుగుతోందని అనుమానం వచ్చి పోలీసులకు చెప్పడంతో ఈ దొంగతనం విషయం బయటపడింది.
Also Read: Rajasthan: ఎడారి నేలల్లో పచ్చని పంటలు.. కోట్లు సంపాదిస్తున్న రైతులు..
“మేము వెతుకుతున్నప్పుడు, ఒక ఇంట్లో అనుమానం వచ్చింది. వెంటనే దాడి చేశాం. లోపల చూస్తే సుమారు 25 అడుగుల సొరంగం భూమి కిందకు తవ్వి, అది హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్‌కి కనెక్ట్ అయ్యి ఉంది” అని డిప్యూటీ కమిషనర్ అమిత్ కుమార్ చెప్పారు. బగ్రూలో పైప్‌లైన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
దొంగలు హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్‌కు చిన్న రంధ్రం చేసి, అక్కడ ఒక వాల్వ్, ఒక సన్నని పైప్‌ను పెట్టారు. దాని ద్వారా చాలా రోజుల పాటు మెల్లగా డీజిల్ తీసేశారు. పోలీసులు దొంగతనం జరిగిన చోట దాడి చేసినప్పుడు, అక్కడ దొంగిలించిన డీజిల్‌తో నిండిన చాలా డ్రమ్ములు, ఒక పిక్అప్ ట్రక్, ఇంకా సొరంగం తవ్వడానికి వాడిన రకరకాల పనిముట్లు దొరికాయి.
పోలీసులు విచారించగా, ప్రధాన నిందితుడు రాజేష్ ఉరంగ్ అసలు విషయం పూస గుచ్చినట్లు చెప్పాడు. ఈ మొత్తం దొంగతనం ప్లాన్‌ను ఢిల్లీకి చెందిన శ్రవణ్ సింగ్ అనే వ్యక్తి, అతని బావమరిది ధర్మేంద్ర వర్మ కలిసి చేశారని చెప్పాడు. ప్రస్తుతం శ్రవణ్ సింగ్, ధర్మేంద్ర వర్మ పరారీలో ఉన్నారు. ఈ ముఠా ఇంతకు ముందు కూడా జైపూర్, అజ్మీర్‌లలో ఇలాంటి దొంగతనాలు చేసిందని, వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఒక రకంగా వాళ్ళు వాటర్ బిజినెస్ చేస్తున్నామని నమ్మబలికి, లోపల ఈ దొంగతనం పని చేశారట. వాళ్ళు దొంగిలించిన డీజిల్‌ను బ్లాక్ మార్కెట్‌లో తక్కువ రేటుకు అమ్మి, చాలా డబ్బులు సంపాదించారు.