Raghu Rama Krishna Raju : ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణం రాజు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. గత ఏడేళ్ల పాటు ఆయన పేరు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తూ వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పార్లమెంట్ సభ్యుడయ్యారు. కొద్ది రోజులకే ఆ పార్టీని విభేదించారు. మొన్నటి ఎన్నికలకు ముందు టిడిపిలో చివరి నిమిషంలో చేరి ఉండి శాసనసభ టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యే గా గెలిచి డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అయితే మతమార్పిడిల నిరోధం అనే అంశాన్ని తన రాజకీయ అజెండాగా మార్చుకున్నట్టు కనిపిస్తున్నారు. గతంలో ఎంపీగా ఉన్న సమయం నుంచి ఈ విషయంపై గళం ఎత్తారు ఆయన. ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ క్షేత్రస్థాయిలో హిందూ ధర్మ రక్షణ, మతమార్పిడుల అడ్డుకట్ట దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వివాదాస్పదం అవుతున్నారు.
* ఆ ఘటనతో..
తన సొంత నియోజకవర్గంలో శ్రీరామనవమినాడు జరిగిన పరిణామాలు గురించి తెలిసిందే. శ్రీరాముడి విగ్రహానికి పూలమాలలు వేసేందుకు వెళ్తున్న ఆయనపై దాడి జరిగింది. అయితే దీనిని హిందుత్వవాదులు ముక్తకంఠంతో ఖండించారు. రాజకీయ పార్టీలు సైతం స్పందించాయి. ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప. అయితే ఈ రామాలయ వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న రఘురామకృష్ణంరాజు తన అజెండాను అమలు చేయడం ప్రారంభించారు. రాష్ట్రంలో వ్యవస్థీకృతంగా జరుగుతున్న మతమార్పిడులను రఘురామకృష్ణంరాజు మాఫియాగా అభివర్ణించారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పోరాటం చేయడం ప్రారంభించారు.
* సీరియస్ గా దృష్టి..
రాష్ట్రంలో మతమార్పిడులు అనేవి గత కొన్నేళ్లుగా జరుగుతూ వచ్చాయి. పేదరికంతోపాటు అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని సాగుతున్న మార్పిడులపై రఘురామకృష్ణంరాజు గట్టిగానే దృష్టిపెట్టారు. గట్టి హెచ్చరికలు జారీచేశారు. అయితే రఘురామకృష్ణం రాజు రాజకీయ చర్యలను వ్యతిరేకించేవారు ఇప్పుడు ఈ మతమార్పిడిలపై ఆయన చేస్తున్న పోరాటంపై ఏం చేయాలో వారికి పాలు పోవడం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ విధానం కూడా అదే. పైగా కూటమి పార్టీలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు రఘురామకృష్ణంరాజు. అయితే ఇప్పుడు ఈ మతమార్పిడులకు వ్యతిరేకంగా ఆయన తీసుకున్న గళం ఏపీలో విస్తరిస్తోంది. ప్రజల్లో ఆలోచన తెచ్చిపెడుతోంది. ఇప్పటివరకు రఘురామకృష్ణం రాజు అంటే రాజకీయ కోణంలో ఆలోచించిన వారే ఉండేవారు. అయితే రఘురామకృష్ణం రాజు పై కొంతమంది పాస్టర్లు బాహటంగానే వ్యాఖ్యానించడం ఆయనకు హిందూ సమాజంలో మద్దతు పెరిగేందుకు దోహద పడింది.
* చట్టం కోసం డిమాండ్..
మతమార్పిడుల విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని రఘురామకృష్ణంరాజు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల తరహాలో ఏపీలో కూడా మతమార్పిడిల నిరోధక చట్టం తీసుకురావాలని డిమాండ్ ను రఘురామకృష్ణం రాజు బలంగా వినిపించడం ప్రారంభించారు. బలవంతంగా మతమార్పిడులను చేయడం, అందుకు ప్రలోభాలకు గురిచేయడం వంటి వాటిపై కఠినమైన చట్టాలను ప్రయోగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే కూటమిలో కీలకంగా ఉన్నారు రఘురామకృష్ణంరాజు. పైగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఆపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విధానం కూడా అదే. మరోవైపు రాష్ట్రంలో హిందూ ఓటు బ్యాంకు ను ఏకీకృతం చేయడంలో రఘురామకృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇది కూటమికి కలిసి వచ్చే అంశం గాను స్పష్టమవుతుంది. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది.
