Maharashtra : ఇటీవల మహారాష్ట్రలోని సింధు దుర్గ్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఇనుప గొలుసులతో బంధించి ఉన్న మహిళ కేసులో ఉత్కంఠ వీడింది. వర్షానికి తడుస్తూ, ఆకలికి అలమటించి, పూర్తిగా నీరసించిపోయిన ఆ మహిళను ఓ మేకల కాపరి గుర్తించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆమెను ప్రత్యేక వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆమె వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి.. ఆమె అమెరికా జాతీయురాలని గుర్తించారు. ఇదే సమయంలో ఆమె భర్త ఇనుప గొలుసుతో బంధించాడని.. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతుండడం వల్లే ఇలా చేశాడని మొదట్లో వార్తలు వచ్చాయి. జాతీయ, స్థానిక మీడియా కూడా ఇదే కోణంలో వార్తలు రాసింది. దీంతో ఆ మహిళపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఆమె భర్త ఎవరు? ఎందుకు అలా చేశాడు? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేయడం మొదలైంది. అయితే ఈ కేసులో ప్రస్తుతం సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఫలితంగా అమెరికన్ మహిళ కేసులో ఉత్కంఠ వీడిందని పోలీసులు చెబుతున్నారు.
ఆ అమెరికన్ మహిళకు మానసిక పరిస్థితి బాగోలేదు. ఆమె కొంతకాలంగా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తోంది. దీనికి తోడు ఆమెకు అనారోగ్య సమస్యలు కూడా జతయ్యాయి. ” ఆమెను చూస్తుంటే బాధాకరంగా ఉంది. ఆమె మూడు తాళాలు, ఇనుప గొలుసును తన వెంట తెచ్చుకుంది. అందులో ఒక తాళంతో ఆమెకు ఆమె చెట్టుకు కట్టేసుకుంది. మేకల కాపరి చెప్పిన వివరాల ఆధారంగా ఆమెను మేము కనుగొన్నాం. ఆమెను బయటికి తీసుకొస్తున్న క్రమంలో.. కొన్ని వందల మీటర్ల దూరంలోనే మిగతా తాళాలు మాకు కనిపించాయి. అయితే ఆమె ఆ చెట్టుకు బంధీ అయి ఎన్ని రోజులైంది తెలియ రాలేదు. ఈ విషయంపై మాకు స్పష్టత లేదని” సింధ్ దుర్గ్ పోలీసులు చెబుతున్నారు.
వాంగ్మూలం రికార్డు చేశారు
అమెరికన్ మహిళ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఆమె చెబుతున్న వివరాలు తమను భయభ్రాంతులకు గురిచేశాయని పోలీసులు అంటున్నారు. ఆమెకు సంబంధించిన సమాచారాన్ని అమెరికాలో ఉంటున్న ఆమె తల్లికి చెప్పామని, ఇంతవరకు ఆమె మమ్మల్ని సంప్రదించలేదని పోలీసులు అంటున్నారు.. అయితే ఆ మహిళ పేరు లలితా కయీ కుమార్ అని తేలింది.. ఆమెకు కొన్ని సంవత్సరాల నుంచి తీవ్రమైన మానసిక సమస్య ఉంది.. అమెరికా నుంచి ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? మహారాష్ట్రలోని దట్టమైన అటవీ ప్రాంతానికి ఎందుకు వెళ్ళింది? అటవీ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆమెతోపాటు ఎవరు ఉన్నారు? తాళాలు, గొలుసు కొనుగోలు చేసేందుకు డబ్బులు ఎవరు ఇచ్చారు? లలిత గురించి చెప్పినప్పటికీ ఆమె తల్లి ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం రాబడతామని పోలీసులు అంటున్నారు. మొత్తానికి లలిత కేసులో ఇన్నాళ్లకు కొంతమేర మిస్టరీ వీడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తదుపరి దర్యాప్తును మొదలుపెట్టారు.
ఈ కేసులో మరొక ట్విస్ట్ చోటుచేసుకుంది. లలిత వద్ద ఉన్న సంచిలో ఒక లేఖ లభ్యమైనది. అందులో ఆమె మాజీ భర్త చేసిన దుర్మార్గాలను రాసింది. వాటి ఆధారంగా పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసును మహారాష్ట్ర పోలీసులు అత్యంత సవాల్ గా తీసుకున్నారు. కేసు విచారణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని నియమించింది. వారు ఈ కేసును అనేక కోణాలలో పరిశీలిస్తున్నారు. ఆమె మాజీ భర్త వివరాలను కూడా సేకరించారు. ఒక బృందాన్ని అతడి స్వస్థలానికి పంపించారు. మరికొద్ది రోజుల్లో ఈ కేసు విచారణ పై మరింత స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More