https://oktelugu.com/

Phone Tapping Case: తెలంగాణను షేక్ చేస్తున్న ఫోన్ల ట్యాపింగ్.. వెలుగు చూస్తున్న సంచలనాలు..

మాజీ డిఎస్పి ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 27, 2024 / 04:29 PM IST

    Phone Tapping Case

    Follow us on

    Phone Tapping Case: విక్రమార్కుడు సినిమా చూశారా.. అందులో అత్తిలి సత్తిబాబు లక్ష్మీదేవి వస్తుందని చెప్పి ఆడవాళ్లకు అరగుండ్లు గీకుతాడు. ఆ తర్వాత బేరం కుదరక మధ్యలోనే వదిలేస్తాడు. అతడు గీకిన సగం గుండ్లను బ్రహ్మానందం ఎక్కువ ధరకు బేరమాడి గీకుతాడు. ఇలా అత్తిలి సత్తిబాబు బాధితులు మొత్తం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తారు. ఆమెకు వారి బాధ చెప్పుకుంటారు. దీంతో ఆమె ఏడుస్తూ తనకు కూడా గుండు గీకాడని నెత్తికి ఉన్న విగ్గును లేపి చూపిస్తుంది. ఈ సన్నివేశం చూడ్డానికి అనిపిస్తుంది.. చూస్తుంటే నవ్వొస్తుంది. స్వల్ప మార్పులతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల పరిస్థితి ఇలాగే ఉంది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తమ ఫోన్ టాప్ చేశారని ఆరోపిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు డిజిపి కార్యాలయానికి వరుస కడుతున్నారు..

    మాజీ డిఎస్పి ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. ట్యాపింగ్ కోసం ఇజ్రాయిల్ నుంచి పరికరాలు దిగుమతి చేశారని.. ఈ ఖర్చు మొత్తం ఓ అప్పటి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ భరించాడని.. కొంతమంది పోలీసు అధికారులు అతనికి సహకరించాలని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ ఎమ్మెల్సీకి తెలంగాణ పోలీసులు నోటీసు జారీ చేశారని.. త్వరలోనే ఆయనను విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది.. ప్రణీత్ రావు కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకరించారని, ఆయన నియోజకవర్గ పరిధిలో పర్వతగిరి గ్రామంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకు కొత్త విషయం వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు మా మొర ఆలకించండంటూ బిజెపి కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు.

    కేవలం కాంగ్రెస్ నాయకులు మాత్రమే కాకుండా బిజెపి నాయకులు కూడా తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గత ప్రభుత్వంపై, ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ” రేవంత్ రెడ్డిని తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ ఎలా ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలుసు.. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో తొలి ఫోన్ ట్యాపింగ్ బాధితుడు అతడే. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన అధికారులను ఎందుకు క్షమిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేసే చిత్తశుద్ధి ఉందా? డిజిపి కి అటాచ్ చేసిన శ్రీనాథ్ రెడ్డి ఎవరు? పదవి విరమణ పొందిన తర్వాత మాజీ డిజిపి మహేందర్ రెడ్డి ఎందుకు కనిపించడం లేదు? ఇంటెలిజెన్స్ లో పని చేసిన ఇద్దరు కీలక అధికారులను అమెరికా ఎందుకు పంపించారు? మరికొందరిని కూడా ఎందుకు తప్పించాలని చూస్తున్నారు? ట్యాపింగ్ పరికరాలు ఎవరి కొనుగోలు చేశారు? ఎంతకు కొనుగోలు చేశారు? డబ్బు ఎలా పంపించారు? దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? మార్చి 19న ఒకే విమానంలో రేవంత్, హరీష్ రావు ఏం మాట్లాడుకున్నారంటూ” రఘునందన్ రావు విమర్శలు కురిపించారు. మరోవైపు బిజెపి తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ప్రభుత్వం త్వరగా నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మండిపడ్డారు. ఈ కేసులో విచారణ పూర్తి చేసి అందరి పేర్లు బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. మేము బాధితులమంటూ ఒక అడుగు ముందుకేసి డీజీపీ రవి గుప్తాను కలిశారు. విచారణ పరిధిని పెంచాలని డీజీపీకి వినతిపత్రం అందించారు. తనతోపాటు చాలామంది కాంగ్రెస్ నాయకుల ఫోన్ కాల్స్ అప్పటి ప్రభుత్వ పెద్దలు విన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తమ మాటలు దొంగ చాటుగా విని రాజకీయంగా ఇబ్బందుల పాలు చేశారని ఆయన అన్నారు. ఇలాంటి రాజకీయాలు చేసి తెలంగాణ సమాజాన్ని భారత రాష్ట్ర సమితి 10 సంవత్సరాల పాటు దోచుకుందని ఆయన ఆరోపించారు.. నిందితులపై త్వరగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు తాము బాధితులమంటూ ముందుకు రావడం.. చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరడం.. తెలంగాణ రాజకీయాల్లో.. అది కూడా పార్లమెంటు ఎన్నికల ముందు చర్చనీయాంశంగా మారింది.