Pawan Kalyan Health Update : గత కొంతకాలంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎదురుకుంటున్న ఆరోగ్య సమస్యలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గానే ఆయనకు నాజిల్ సర్జరీ జరిగింది. సుమారుగా నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి ఆయన విశ్రాంతి తీసుకునే సమయం వచ్చేసింది. కొద్దినెలల క్రితం పవన్ కళ్యాణ్ రెండు భుజాలకు గాయాలు అయ్యాయి. ఆ గాయాలు క్రమేణా పెరిగి తీవ్ర రూపం దాల్చింది. ఈ కారణం చేత రొటేటర్ కప్ దెబ్బ తినడంతో సరిగా కూర్చోలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ కి ఏర్పడింది. కొద్దిరోజుల క్రితమే ఆయన ముంబై కి వెళ్లి ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ లో చెకప్ చేయించుకున్నారు. అక్కడి వైద్యులు తక్షణమే భుజాలకు ఆపరేషన్ చెయ్యాలి, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదురుకోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ ని హెచ్చరించారు.
ప్రభుత్వ కార్యక్రమాలు షెడ్యూల్ చేయబడి ఉన్నాయి , అవి పూర్తి అయిన వెంటనే ఇక్కడికి వచ్చి సర్జరీ చేయించుకుంటానని చెప్పారట పవన్ కళ్యాణ్. షెడ్యూల్ చేయబడిన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయి , నేడు ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీలు , ఎమ్మెల్సీలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశం తర్వాత హైదరాబాద్ కి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ , అక్కడి నుండి ముంబై కి వెళ్లి ఈ కీలక సర్జరీ చేయించుకోనున్నారు. సర్జరీ తర్వాత కచ్చితంగా డాక్టర్లు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోమని సూచిస్తారు , అంటే పవన్ కళ్యాణ్ కనీసం నెల రోజులు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండబోతున్నారు అన్నమాట. అయితే ఈ సర్జరీల కారణంగా పవన్ కళ్యాణ్ కి దశాబ్దాల నుండి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి కాస్త విముక్తి కలిగినట్టు అయ్యింది. ఇకపై ఆయన స్వేచ్ఛగా పాలన చేసుకోవచ్చు , సినిమాలు కూడా చేసుకోవచ్చు.
చిన్నతనం నుండి పవన్ కళ్యాణ్ సైనస్ తో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు కరోనా సోకినప్పుడు ఆరోగ్యం బాగా క్షీణించింది. సైనస్ ఉండడం తో మరింత తీవ్ర రూపం దాల్చింది , అప్పటి నుండి ముక్కు మూసుకొని పోవడం, నెమ్ము చేరడం వంటివి జరుగుతూ ఉండేవి. ఆ కారణం చేత ఆయన తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య నుండి మొన్న చేయించుకున్న సర్జరీ కారణంగా పవన్ కళ్యాణ్ కి శాశ్వత విముక్తి కలిగింది. ఇప్పుడు రొటేటర్ కఫ్ సర్జరీ ని చేయించుకున్న తర్వాత ఈ సమస్య నుండి కూడా ఆయన దూరం కానున్నారు.
