Pawan Kalyan: జనసేనకు విరాళాల్లేవు.. అందుకే పవన్ 10 కోట్లు ఇచ్చాడు

జనసేన ఆవిర్భావం నుంచి అధికారం చేపట్టలేదు. పవర్ పాలిటిక్స్ చేజిక్కలేదు. కానీ పవన్ మాత్రం పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు. సినిమాల్లో సంపాదించిన మొత్తాన్ని పార్టీ కోసం వినియోగిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు.

Written By: Dharma, Updated On : March 27, 2024 12:12 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మరోసారి తన ఔదార్యతను చాటుకున్నారు. జనసేనకు భారీగా విరాళం ప్రకటించారు. రూ.10 కోట్లు అందించారు. సోదరుడు నాగబాబు చేతుల మీదుగా అందించారు. అయితే పవన్ ను జనసైనికులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికల ముంగిట విరాళాల సేకరణకు పవన్ ముందుగా చేసి చూపించాడని.. అందులో ఔదార్యం ఏమిటని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. విరాళాల కోసమే ఎత్తుగడగా చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా రచ్చ నడుస్తోంది.

జనసేన ఆవిర్భావం నుంచి అధికారం చేపట్టలేదు. పవర్ పాలిటిక్స్ చేజిక్కలేదు. కానీ పవన్ మాత్రం పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు. సినిమాల్లో సంపాదించిన మొత్తాన్ని పార్టీ కోసం వినియోగిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. పార్టీ కోసం స్టార్ డంను వదులుకున్నానని.. తన పిల్లల కోసం దాచిన సొమ్మును సైతం వెచ్చించానని చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. సినిమాలు నా వృత్తి అయితే.. రాజకీయం ప్రవృత్తి అంటూ.. రెండింటిలో కొనసాగాల్సిన అవసరం తనకు ఉందని.. అప్పుడే పార్టీని నడిపించగలనని.. తనకు ఇతరులు మాదిరిగా వ్యాపారాలు లేవని పవన్ తేల్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట జనసేన పార్టీకి 10 కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ ఎన్నికల్లో జనసేన క్రియాశీలక పాత్ర పోషించింది. టిడిపి తో పాటు బిజెపితో పొత్తు పెట్టుకుంది. భారీగా అసెంబ్లీ స్థానాలు వస్తాయని భావించారు. ఇతర పార్టీల నుంచి నేతలు క్యూ కట్టారు. అయితే 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు మాత్రమే దక్కడంతో ఆశావహులు నీరుగారిపోయారు. గతంలో టిక్కెట్ వస్తుందని చెప్పి పార్టీకి చాలామంది విరాళాలు ఇచ్చారు. అటువంటి వారి నుంచి విమర్శలు రావడంతో పవన్ స్పందించారు. ఆ సొమ్మును తిరిగి ఇచ్చేయాలని పార్టీ వర్గాలను ఆదేశించారు. ఇకనుంచి విరాళాలు తీసుకోవడం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విరాళాలు ఇస్తున్న వారంతా టికెట్లు ఆశిస్తున్నారని.. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సైతం పవన్ ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పవన్ 10 కోట్ల విరాళం ప్రకటించడం వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులతో పాటు భవిష్యత్తులో పనులు,పదవులు కావాల్సినవారు విరాళాలు ప్రకటిస్తారని ఆశించే పవన్ ఈ ఎత్తుగడకు దిగినట్లు ప్రత్యర్థుల ఆరోపణ చేస్తున్నారు.

జనసేన ఖర్చులను టిడిపి భరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. గ్లాస్ పార్టీ ఖర్చులన్నింటినీ చంద్రబాబు భరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ తిరిగేందుకు హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు పంపేది టిడిపి నేనని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అటు సినీ రంగం నుంచి సైతం పవన్ కు పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయని సైతం ఆరోపణలు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ అంశంగా మారిపోయింది. దీనిపై పవన్ అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ తరహా విమర్శలకు చెక్ చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే పవన్ స్వయంగా 10 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. విమర్శలకు చెక్ చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఇప్పటికైనా ఈ విమర్శలకు చెక్ పడుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.