Mahaa TV Vamsi media controversy : ఏపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏటా ప్రజాప్రతినిధులపై నమోదయ్యే క్రిమినల్ కేసులను ఏడిఆర్ రిపోర్టు బయట పెడుతుంది. దేశవ్యాప్తంగా నేతలపై ఉన్న కేసులను వెల్లడిస్తుంది ఈ అధ్యయనం. అయితే తాజాగా ఏడిఆర్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా నేతలపై ఎక్కువగా కేసులు ఉన్న రాష్ట్రంగా ఏపీ ఉన్నట్లు స్పష్టమైంది. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేస్తోంది. అయితే దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో టిడిపి అనుకూల మీడియా సైతం పదే పదే అదే ప్రస్తావన తీసుకురావడం ప్రజల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టిడిపికి అనుకూల మీడియాగా భావించే మహా టీవీలో దీని పైనే చర్చ జరిపారు. మహా టీవీ వంశీ నేతలపై ఉన్న కేసులను బయటపెట్టారు. ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది.
*మహా టీవీ పెట్టిన థంబ్ నేల్

* రికార్డు స్థాయిలో కేసులు..
ఏ డి ఆర్ నివేదిక ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబుపై రికార్డు స్థాయిలో 19 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అటు తదుపరి మంత్రి నారా లోకేష్ పై 17 కేసులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై 8 కేసులు ఉన్నట్లు ఈ నివేదిక తేల్చింది. అయితే ఇవన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నమోదైనవే. అప్పుడెప్పుడో చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టు సందర్శన వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అప్పటి కేసు ఇప్పుడు కూడా కొనసాగుతూ వచ్చింది. ఇక జగన్ హయాంలో చంద్రబాబు పై పెట్టిన కేసుల గురించి చెప్పనవసరం లేదు. ప్రతిపక్ష నేతగా జిల్లాల పర్యటన చేసినప్పుడు, చివరకు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో సైతం ఆయన పై కేసు నమోదైన దాఖలాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏకంగా ఏడు కేసులను ఒకేసారి నమోదు చేశారు. అంగళ్లు కేసు, రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్, ఇరిగేషన్, ఇసుక ఇలా అన్నింటి పై కేసులు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి.
* పవన్, లోకేష్ లపై సైతం
మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సైతం పాత కేసులను లెక్క కడుతూ ఏడిఆర్ రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడెప్పుడో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా సమయంలో సైతం తెలంగాణలో పవన్ కళ్యాణ్ పై కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో నమోదైన కేసులతో పాటు ఓ మీడియా ఛానల్ తో వివాదం కేసు కూడా ఉంది. అయితే మిగతా కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టించినవే. వాలంటీర్లను దారుణంగా అవమానించారని వారితోనే కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇక మంత్రి నారా లోకేష్ విషయంలో చెప్పనవసరం లేదు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే కేసు పెట్టారు. ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో అడుగడుగునా అడ్డంకులు ఏర్పరిచారు. ఆ సమయంలోనే ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏడిఆర్ రిపోర్టులో అదే తేలింది. కానీ తమ హయాంలో నమోదైన కేసులను మరిచి వైసిపి నేతలు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు.
* రాజకీయ ప్రేరేపిత కేసులు..
సహజంగానే రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి ఏపీలో. అయితే గతంలో వైసిపి ప్రభుత్వం ఈ ప్రతీకార రాజకీయాలకు తెరలేపింది. ముఖ్యంగా చంద్రబాబుపై ఆధారాలు లేని కేసులను మోపింది. దాదాపు 52 రోజులపాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఏకకాలంలో ఏడు కేసులు నమోదు చేసింది. అయితే తమ హయాంలో కేసులు నమోదు అయ్యాయన్న విషయాన్ని మరిచిపోయి.. నేరచరిత్ర చూపించే పనిలో పడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే దానిని అడ్డుకునే క్రమంలో మహా టీవీ లాంటి టిడిపి అనుకూల మీడియా సైతం అదే అంశంపై డిబేట్ పెట్టడం విశేషం. వైసీపీ హయాంలో నమోదైన కేసులని వంశీ చెప్పారు కానీ.. కూటమి నేతలపై కేసులు నమోదయ్యాయన్న ప్రచారానికి తెరతీసినట్లు అయ్యింది.
మహా వంశీ వైసీపీకి కౌంటర్ ఇవ్వబోయి సొంత టీడీపీ, పవన్ కళ్యాణ్ పరువు తీశాడన్న చర్చ నడుస్తోంది. మహా వంశీ ఏదైనా కానీ పాజిటివ్ కోణంలోనే చెప్పాలని చూసినా పవన్ నంబర్ 1 క్రిమినల్ అంటూ ఆయన చానెల్ హోరెత్తించడంతో అందంతా నెగెటివ్ అయిపోయింది. దీంతో ప్రత్యర్థులు మహావంశీని టార్గెట్ చేస్తూ పవన్ పై ఇలా అంటాడా? అని ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. జనసైనికులు సైతం మహావంశీని టార్గెట్ చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు.మొత్తానికి ఈ ఎపిసోడ్ లో పవన్ పై వ్యాఖ్యలు చేసి మహా వంశీ అడ్డంగా బుక్కయ్యాడనే చెప్పాలి.
