T20 World Cup 2026 : మరికొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి అన్ని జట్లు తమ ప్లేయర్లకు వివరాలను ప్రకటించాయి. బంగ్లాదేశ్ ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. లేని ఆరోపణలు చేసి.. చివరికి తగిన మూల్యం చెల్లించుకుంది.
టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించిన తర్వాత.. పాకిస్తాన్ జట్టు యాజమాన్యం జట్టు యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఆదివారం టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే జట్టు ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాము టోర్నీలో ఆడేది పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల కథనాల ప్రకారం ఐసీసీ బంగ్లాదేశ్ విషయంలో వ్యవహరించిన తీరు తమకు ఇబ్బంది కలిగించిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెబుతోంది. అంతేకాదు, ఒకవేళ ఈ టోర్నీలో ఆడితే భారత జట్టు తో(IND vs PAK) జరిగే మ్యాచ్ ను బహిష్కరించాలని పాకిస్తాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లు మొత్తం శ్రీలంకలో ఐసీసీ నిర్వహించనుంది.
“ఇప్పటికైతే జరుగుతున్న వ్యవహారం పాకిస్తాన్ ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. టి20 ప్రపంచ కప్ లో ఆడేందుకు ప్లేయర్ల జాబితాను ప్రకటించాం. అయితే ఈ టోర్నీలో ఆటగాళ్లు ఆడేందుకు ప్రభుత్వం అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. దీనిని క్రికెట్ కు సంబంధించిన వ్యవహారం లాగా చూడకూడదు. ఇదంతా ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం. ఇప్పటికే బంగ్లాదేశ్ తనకు సంబంధించిన గౌరవపూర్వకమైన హక్కులు నష్టపోయింది. ఐసీసీ ఏకపక్షమైన వైఖరితో బంగ్లాదేశ్ తీవ్రంగా నష్టపోయింది. అందువల్లే మేం కూడా టోర్నీలో ఆడే విషయంపై ఆలోచన చేస్తున్నాం. భారత్ ఆడుతున్న మ్యాచ్ లకు సంబంధించిన వేదికలను ఎంచుకునే స్వేచ్ఛనిచ్చారు. బంగ్లాదేశ్ జట్టు విషయంలో మాత్రం విరుద్ధంగా వ్యవహరించారు. క్రికెట్ అనేది ప్రపంచ క్రీడగా వర్ధిల్లాలి అంటే ఐసీసీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలా కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని” పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మరో వైపు టి20 ప్రపంచ కప్ లో ఆడే విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మూడు విషయాలను పరిశీలిస్తుందని తెలుస్తోంది. ఇందులో మొదటిది టోర్నీలో ఆడే మ్యాచ్ లలో చేతులకు నల్లటి బ్యాండ్ లు ధరించడం.. వచ్చే నెల 15న కొలంబోలో భారత జట్టుతో జరిగే మ్యాచ్ నుంచి నిష్క్రమించడం.. ఇక మూడవది తాము ఈ టోర్నీలో సాధించే ప్రతి విజయాన్ని బంగ్లాదేశ్ జట్టుకు అంకిత చేయడం.. వంటి అంశాలను పరిశీలిస్తుందని తెలుస్తోంది.