Nari Nari Naduma Murari Review : నటీనటులు: శర్వానంద్, సంయుక్త మేనన్, సాక్షి వైద్య, సత్య, సంపత్ రాజ్, సీనియర్ నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, సుదర్శన్, సునీల్, శ్రీవిష్ణు(అతిథి పాత్ర), మధు నందన్ తదితరులు.
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ V.S
కథ: భాను భోగవరపు
డైలాగ్స్: నందు సవిరగన
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాణం: A.K.ఎంటర్టైన్మెంట్స్
సంక్రాంతి బరిలో ఈసారి 5 సినిమాలు బరిలోకి దిగడం ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించిన మాట వాస్తవం. ఈ ఐదు సినిమాల్లో పెద్ద సినిమాలు మూడు. పెద్ద అంటే ఎందులో పెద్ద అంటూ మీరు ప్రశ్నించాల్సిన అవసరమే లేదు. బడ్జెట్ లో.. రికవరీ టార్గెట్ లో పెద్ద నంబర్లు ఉండే సినిమాలే పెద్ద సినిమాలు. మిగతా రెండిట్లో ఒకటి శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమా కంటెంట్ కంటే ఎక్కువగా ప్రేక్షకులను ఆకర్షించిన అంశం టైటిల్. నందమూరి బాలకృష్ణ 1990 లో నటించిన సూపర్ హిట్ చిత్రం టైటిల్ ను మరోసారి ఈ సినిమాకు ఎంచుకోవడంతోనే అందరి కళ్ళూ ఈ సినిమాపై పడ్డాయి. మరో అంశం ఏంటంటే ‘సామజవరగమన’ లాంటి ఎంటర్టైనర్ ను రూపొందించిన రామ్ అబ్బారాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం. ఇవంతా బాగానే ఉన్నాయి కానీ శర్వానంద్ ఈమధ్య నటించిన సినిమాల ట్రాక్ రికార్డ్ మాత్రం అస్సలు బాగాలేదు. ఇద్దరు లేడీస్ మధ్య ఉండే జెంటు టైటిల్ తో వచ్చిన ఈ సినిమా శర్వాకు కాస్తైనా రిలీఫ్ ఇచ్చిందా లేదా రివ్యూలో చూద్దాం పదండి.
గౌతమ్(శర్వానంద్) ఒక ఆర్కిటెక్ట్, నిత్య(సాక్షి వైద్య) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ పెద్దాళ్ళున్నారే.. కుర్రాళ్ల ప్రేమలను అర్థం చేసుకోరు కదా.. సరిగ్గా ఆ సంప్రదాయాన్ని 2026 లో కూడా నిరాటంకంగా కొనసాగిస్తూ నిత్య తండ్రి రామలింగయ్య(సంపత్ రాజ్) వీరి పెళ్లి కి అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. కానీ కూతురు పట్టుదల చూసి కొన్ని రోజుల తర్వాత ఒక కండిషన్ పై పెళ్లికి అంగీకారం తెలుపుతాడు. ఆ కండిషన్ ఏంటంటే ఇద్దరి పెళ్లి.. బాజాలు – బజంత్రీలు, ప్రీ-పోస్ట్ వెడ్డింగ్ షూట్ లు, 64 ఐటమ్స్ ఉండే మెనూలు గట్రా లేకుండా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడమే. ఓస్.. అంతేగా ప్రేమికులిద్దరూ అలా రెండు కార్లలో రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళి సంతకాలు చేస్తే అయిపోతుంది అంటే ఇక సినిమాలో కథ ఎక్కడ ఏడుస్తుంది? సరిగ్గా అక్కడే వస్తుంది చిక్కు. అసలు నిత్య – గౌతమ్ ల సింపుల్ రిజిస్టర్ మ్యారేజ్ కి వచ్చిన అడ్డంకులు ఏంటి? అవి తొలగించుకునే ప్రయత్నంలో ఎలాంటి పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. రెండో హీరోయిన్ దియా(సంయుక్త) ఎవరు? కథలో చివరికి ఏమౌతుంది.. ఇలాంటి విషయాలు సిల్వర్ స్క్రీన్ పై సూడాలి బాబయ్య.
కొన్ని రివ్యూలతో వచ్చే చిక్కేంటంటే స్పాయిలర్స్(చెప్పకూడని ఎలిమెంట్స్ ను ముందే రివ్యూలో చెప్పేయడం) లేకుండా రాయాల్సి రావడం. ఈ సినిమాతో అదే చిక్కొచ్చి పడింది. శర్వానంద్ కు వచ్చిన సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేసిన ప్రయత్నాలు, స్నేహితులు ఇచ్చే సలహాలు అన్నీ చక్కగా కుదిరాయి. ఒకటి సెట్ అయింది అనుకునేలోపే ఇంకో సమస్య ఎదురవడం, అది పరిష్కరించేలోపే ఇంకో ట్విస్ట్ ఎదురుకావడం.. ఇదంతా ప్రేక్షకులను ఫోన్లో వాట్సాప్ మెసేజులు చూసుకోనివ్వదు. ఈ ట్విస్టులకు తోడు సత్య, సీనియర్ నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, సునీల్ ల పాత్రలు చేసే కామెడీకి, ఇద్దరు హీరోయిన్లు ఇచ్చే ట్విస్టులకు రెండు మూడు నిముషాలకోసారైనా నవ్వక తప్పని పరిస్థితి. ఒకటి రెండు సందర్భాలలో అడల్ట్ జోక్స్ ఉన్నప్పటికీ అవి నర్మగర్భంగానే ఉన్నాయి. దాదాపుగా పరిధి దాటకుండా ఇలా నవ్వించగలగడం దర్శకుడు, రచయితల ట్రెండీ థింకింగ్ కు ఒక నిదర్శనం. ఈ సినిమా కథ కంటే ఎక్కువగా పాత్రలు, ట్విస్టులు, స్క్రీన్ ప్లే పై ఆధారపడి నడుస్తుంది. అందులోనుంచే కామెడీని పుట్టించే ప్రయత్నం చేసి అందులో విజయం సాధించారు.
మంచివాడైనప్పటికీ పరిస్థితులు పగబట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొనే పాత్రలో శర్వా అలవోకగా నటించాడు. శర్వా ప్రాణస్నేహితుడిగా సుదర్శన్, శర్వా తండ్రి పాత్రలో సీనియర్ నరేష్, అడ్వొకేట్ గా వెన్నెల కిషోర్, రిజిస్ట్రార్ గా సునీల్ నవ్వులు పూయించారు. ఇక లవ్ కుశ గా సత్య ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. హీరోయిన్ల తండ్రుల పాత్రల్లో సంపత్ రాజ్ కు ఎక్కువ స్కోప్ దక్కింది. శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఓకే. దాదాపు అందరూ కామెడీకి తమ వంతు సాయం చేశారు.
రైటింగ్ డిపార్ట్మెంట్.. అందులోనూ ముఖ్యంగా డైలాగ్స్ ఈ సినిమాలో నవ్వులు పూయించాయి. కథ మరీ అద్భుతమైనది కాదు కానీ సినిమాకు తగిన కాన్ ఫ్లిక్ట్, హిట్ సినిమాకు అవసరమైన కూసింత కొత్తదనం మాత్రం డెఫినిట్ గా ఉంది. రైటింగ్ తర్వాత సినిమాకు మరో అసెట్ సంగీతం. విశాల్ చంద్రశేఖర్ సంగీతం బాగుంది. సినిమా మూడ్ కు తగ్గట్టుగా నేపథ్య సంగీతం ఉంది. పాటలు కూడా బాగున్నాయి. వీయస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా సినిమా థీమ్ ను ఎలివేట్ చేసే విధంగా ఉంది.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. కొన్ని ప్రిడిక్టబుల్ సీన్స్
2. కామెడీ గోలలో పడి కొన్ని చోట్ల ఎమోషన్ తగ్గడం
– ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. డైలాగ్స్, కామెడీ
2. సంగీతం
3. లీడ్ యాక్టర్స్, కమెడియన్ల నటన, ప్రత్యేకంగా సత్య నటన
రేటింగ్: 3 /5
ఫైనల్ వర్డ్: ఫుల్ ఎంటర్టైన్మెంట్