middle east war : మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం చమురు రవాణా, ఇతర వస్తువులు, ముడి పదార్థాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతోంది. యుద్ధం వల్ల చమురు రవాణా తీవ్రంగా ప్రభావితమవుతోంది. దీనికి తోడు రసాయనాలు, ఇతర ముడి పదార్థాల రవాణా కూడా ఇబ్బందిగా మారింది. హర్ముజ్ జల సంధిలో ఓడల ద్వారా జరిగే సరుకు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచం మొత్తం ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటివరకు మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల కేవలం సరుకులు.. ఇతర ముడి పదార్థాలు.. చమురు రవాణా మాత్రమే ప్రభావితమైందని అందరూ అనుకున్నారు. గల్ఫ్ దేశాలలో ఎయిర్ ఎమర్జెన్సీ విధించడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా దేశాలలో పరిస్థితి దారుణంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అంతు పట్టకుండా ఉంది. యుద్ధం నేపథ్యంలో అన్ని దేశాలు పట్టు విడవడం లేదు. అందువల్లే యుద్ధం అంతకంతకు తీవ్రమవుతోంది. దీనివల్ల ప్రజల మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం పడుతోంది.
మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల ఆ ప్రభావం క్రికెట్ మీద కూడా పడింది. ఖతార్ దేశంలోని దోహ ప్రాంతంలో మార్చి 25 నుంచి 27 తేదీలలో జరగాల్సిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. ఏప్రిల్ నెలలో ఈ సమావేశాన్ని మళ్లీ నిర్వహిస్తారని తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న యుద్ధం వల్ల అనివార్యంగా ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఒకరోజు ఐసీసీ బోర్డు సభ్యులకు ఈ సమాచారాన్ని పంపించారు..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సమావేశాన్ని దోహ వేదికగా నిర్వహించే అవకాశం లేదని.. మరొక ప్రాంతంలో నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఐసీసీ బోర్డు డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ లు పాల్గొంటారని సమాచారం. ఈ సమావేశంలో క్రికెట్ మనుగడ.. వివిధ దేశాలలో క్రికెట్ విస్తరణ.. క్రికెట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చిస్తారని సమాచారం. దోహా ప్రాంతంలో సమావేశం నిర్వహించాలని ఫిబ్రవరిలో నిర్ణయించారు. కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేశారు. అక్కడ శాంతిభద్రతలు.. పరిస్థితులు అదుపులోకి రాకపోతే.. భవిష్యత్తు కాలంలో ఐసీసీ కార్యకలాపాలు మొత్తం వేరే ప్రాంతం నుంచి జరుగుతాయని తెలుస్తోంది.