Financial Harassment : నేటి కాలంలో అవసరాలకు ఎదుటివారికి డబ్బులు ఇప్పించడం ఎంతటి ప్రమాదకరమో అనేక సంఘటనలు నిరూపిస్తున్నాయి.. ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పటికీ జనాలు మారడం లేదు. పైగా సాటి మనిషి ఆపదలో ఉన్నాడని ఆదుకునేందుకు ముందుకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆ తర్వాత ఊహించని ప్రమాదాలలో చిక్కుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో కుటుంబాలు కూడా కడ తేరి పోతున్నాయి. అటువంటిదే ఈ సంఘటన కూడా.
ఉమ్మడి మెదక్ జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్, రేణుక అనే దంపతులు ఉన్నారు. శ్రీనివాస్ పెద్ద కుమారుడు శ్రీ హర్ష కు కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన రుక్మిణి తో సరిగా నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది శ్రీ హర్ష తన భార్య రుక్మిణి తో కలిసి బెజ్జంకి ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇక్కడ ఒక దుస్తుల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. శ్రీహర్ష దంపతులకు మూడు సంవత్సరాల హరిప్రియ అనే కుమార్తె ఉంది. శ్రీ హర్ష నాణ్యమైన వ్యాపారాన్ని చేసేవాడు. అందువల్ల అతడికి అందరిలో పలుకుబడి ఉండేది. ఈ నేపథ్యంలో తెలిసిన వారికి మధ్యవర్తిగా ఉండి డబ్బులు అప్పుగా ఇప్పించేవాడు. ఇలా ఏకంగా 13 లక్షల వరకు అప్పులు ఇప్పించాడు.
అప్పులు తీసుకున్నవారు కొద్ది నెలల వరకు సక్రమంగానే వడ్డీలు చెల్లించారు. ఆ తర్వాత చెల్లించడం మానేశారు. అప్పులు ఇచ్చినవారు శ్రీహర్ష దుకాణం వద్దకు వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు. గడిచిన వారం రోజులుగా శ్రీహర్ష దుకాణం ముందుకు వచ్చి అప్పులు ఇచ్చినవారు మరింత తీవ్ర స్థాయిలో గొడవలు చేయడం మొదలుపెట్టారు. దీంతో శ్రీ హర్ష మనస్థాపానికి గురయ్యాడు. భార్య రుక్మిణి కూడా తీవ్రంగా మదన పడింది. దీంతో వారిద్దరు క్రిమిసంహారక మందు తాగారు. కుమార్తె హరిప్రియ ఆ వాసనకు తట్టుకోలేక వాంతులు చేసుకుంది. ఇంట్లో నుంచి అరుపులు వినిపించిన నేపథ్యంలో ఇంటి యజమాని తలుపులు తీయడానికి ప్రయత్నించాడు. తలుపులు ఎంతసేపటికి తెరుచుకోకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. శ్రీ హర్ష కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వారంతా వచ్చి తలుపులు పగలగొట్టారు. అప్పటికే రుక్మిణి చనిపోయింది. శ్రీ హర్ష కూడా ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడు.
“ఎంతో నమ్మకంతో మీకు డబ్బులు పలువురి వద్ద అప్పుగా ఇప్పించాను. చివరికి మీరే నన్ను మోసం చేశారు. అప్పులు ఇచ్చినవారు వేధిస్తున్నారు. నా షాప్ ముందుకు వచ్చి గొడవ చేస్తున్నారు. వాస్తవానికి ఇంతటి ఒత్తిడిలో ఒక్కడినే చనిపోవాలని అనుకున్నాను. నేను చనిపోతే నా భార్య సమాజం నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఈ నిర్ణయం తీసుకున్నారు. అమ్మ నాన్నలను మంచిగా చూసుకో తమ్ముడు. మా ఇద్దరిని ఓకే ఉచితి మీద పెట్టి కాల్చండి. నాకు ఈ దుస్థితి రావడానికి కారణమైన వ్యక్తులను అసలు విడిచిపెట్టొద్దని” శ్రీహర్ష ఐదు పేజీల లేఖ రాశాడు. పోలీసులు ఈ లేఖను స్వాధీనం చేసుకొని.. అతడు అప్పులు ఇప్పించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.