కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియను ఆపేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూమిని గురువారం వేలం వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వేలం ప్రక్రియ ఆపాలని కోరుతూ భాజపా నేత విజయశాంతి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. భూముల విక్రయానికి సబంధించి రాష్ట్ర ప్రభుత్వ జారీ చేసిన జీవో 13 కొట్టివేయాలని పిటిషన్ లో కోరారు. నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వేలం వేస్తున్నామని విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవడమేంటని ఈ సందర్భంగా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.