https://oktelugu.com/

KTR : కేటీఆర్ మలేషియా ఎందుకు వెళుతున్నారు.. అరెస్ట్ తప్పించుకోవడానికేనా? రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం కాంగ్రెస్ పార్టీ పై పై చేయి సాధించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సోషల్ మీడియా వేదికగా తూర్పార పట్టింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 8, 2024 11:31 am
    KTR

    KTR

    Follow us on

    KTR :  భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఇటీవల పలు దఫాలుగా విలేకరుల సమావేశాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెడితే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరకు విమర్శించడం మొదలుపెట్టారు. కీలక ఆధారాలను బయటపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలతోనే కాలాన్ని గడిపేస్తోందని.. ప్రభుత్వ ఖజానాను అప్పనంగా కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని.. కాంగ్రెస్ పెద్దలకు డబ్బు మూటలు పంపిస్తోందని ఆరోపించారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఫార్ములా -1 రేస్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ రేసులో గ్రీన్ కో అనే సంస్థ పెట్టుబడులు పెట్టిందని.. మలి దశకు పెట్టుబడులు పెట్టలేక చేతులెత్తేసిందని.. ఆ సమయంలో ప్రభుత్వ నుంచి 55 కోట్లు ఫార్ములా -1 రేస్ నిర్వహించే సంస్థకు వెళ్లాయని.. ఈ వ్యవహారం మొత్తం కేటీఆర్ కను సన్నల్లో జరిగిందని.. ఇదే విషయాన్ని నాడు మున్సిపల్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ పోలీసుల ఎదుట ప్రస్తావించారని.. ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని.. కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా గవర్నర్ బిష్ణు దేవ్ ను కలిశారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. అంతేకాదు కేటీఆర్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా మొదలైంది. అయితే దీనిపై కేటీఆర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తన పార్టీకి సంబంధించిన అనుబంధ సోషల్ మీడియా విభాగాలలో రేవంత్ రెడ్డి పై, కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయించారు. ఫార్ములా -1 రేస్ కంపెనీకి 55 కోట్లు బదాలయించడం ద్వారా హైదరాబాద్ ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా పెరిగిందని.. 7000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయని పార్టీ నాయకుల ద్వారా చెప్పించారు. అయినప్పటికీ ప్రభుత్వం కేటీఆర్ ను వదిలేది లేదన్నట్టుగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఈ పరిణామాలు జరుగుతుండగానే కేటీఆర్ మలేషియా వెళ్ళిపోయారు.

    ఎందుకు వెళ్లినట్టు ..

    మలేషియాలో ప్రస్తుతం తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు హాజరుకావాలని కేటీఆర్ కు ఆహ్వానం అందింది.ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు ఇటీవల కేటీఆర్ ను హైదరాబాదులో కలిశారు. దీంతో వారి ఆహ్వానం మేరకు కేటీఆర్ గురువారం సాయంత్రం మలేషియా వెళ్ళిపోయారు. అయితే ఆయన అరెస్టుకు భయపడే మలేషియా వెళ్లారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఫార్ములా -1 రేసింగ్ లో అవకతవకలు చోటు చేసుకున్నాయని..దానిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించిందని.. మలేషియా నుంచి వచ్చిన తర్వాత కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు అందిస్తుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆ తర్వాత రంగంలోకి ఏసీబీ పోలీసులు దిగుతారని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కేటీఆర్ కేవలం తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది వేడుకల్లో పాల్గొనడానికి మాత్రమే మలేషియా వెళ్లారని.. దానిపై విమర్శలు చేయడం తగదని భారత రాష్ట్ర సంత నాయకులు అంటున్నారు. ఆ పార్టీ అనుబంధ సోషల్ మీడియా విభాగం కూడా అదే తీరుగా వ్యాఖ్యలు చేస్తోంది. మొత్తంగా చూస్తే కేటీఆర్ ఉన్నట్టుండి మలేషియా వెళ్ళిపోవడం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. తదుపరి పరిణామాలు ఏం జరుగుతాయో తెలియదు కానీ.. ఇప్పటికైతే తెలంగాణ పోలీసులు తనను అరెస్టు చేస్తే దానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ వ్యాఖ్యానించడం.. జైల్లో యోగా, డైటింగ్, మెడిటేషన్ చేసుకుంటానని వ్యాఖ్యానించడం గమనార్హం.