
ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్ పతి లో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ ఒకటి ప్రశ్నగా రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ హాజరైన ఎపిసోడ్ లో వ్యాఖ్యాత అమితాబ్ బచ్చన్.. గతంలో కేటీఆర్ చేసిన ట్వీట్ ను ప్రశ్నగా సంధించారు. దీనిపై కేటీఆర్ శనివారం ట్వీట్టర్ లో స్పందిస్తూ, సరదాగా చేసిన ట్వీట్ కేబీసీలో రావడం సంతోషంగా ఉందన్నారు.
కరోనా మందుల పేర్లను ఈ ఏడాది మే 20న తన ట్వీట్టర్ ఖాతాలో ప్రస్తావించిన కేటీఆర్ పలికేందుకు కష్టంగా ఉన్న పేర్లు ఎందుకు పెట్టారో ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. దీనిపై మర్నాడు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బదులిస్తూ తనైతే కరోనిల్, రోజీరో, గో కరోనా గో వంటి పేర్లు పెడతానన్నారు. కేటీఆర్ తన ట్వీట్ ను ఎవరకి ట్యాగ్ చేశారంటూ కేబీసీలో అమితాబ్ ప్రశ్నించారు. దీనిపై సౌరవ్ గంగూలీ బాగా ఆలోచించి శశిధరూర్ అని సరైన సమాధానమిచ్చారు.