ఏపీ (Andhra Pradesh) రాజకీయాల్లో కడప జిల్లాది ప్రత్యేక స్థానం. ఎందుకంటే దశాబ్దాలుగా అక్కడ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ హవా నడిచింది. నందమూరి తారక రామారావు లాంటి నేతలు సైతం కడప విషయంలో అనేక రకాల ఆలోచనలు చేశారు. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. కడపలో ఏకపక్ష విజయం తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ లోటే. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లాలో తిరుగులేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది. కానీ గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. పది అసెంబ్లీ సీట్లకు గాను ఏడు చోట్ల టిడిపి కూటమి గెలుపొందింది. నేతలంతా సమన్వయంతో పని చేయడంతో ఇదంతా సాధ్యమైంది. అయితే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో జరిగిన పరిణామాలకు.. కడపలో రెడ్డప్ప గారి కుటుంబం దూకుడు తోడు కావడంతో టిడిపి కూటమికి ప్లస్ గా మారింది. రెడ్డప్ప గారి మాధవి రెడ్డి కడప ఎమ్మెల్యేగా విజయం సాధించగా.. ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షుడిగా చాలా ఏళ్లుగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు టిడిపి అధ్యక్ష పదవి నుంచి రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డిని తొలగించారు. ఇది కడప జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచింది.
* నేతల మధ్య విభేదాలు..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) కూటమి కడప జిల్లాలో విజయం సాధించింది. ఫలితాలు వచ్చాక మాత్రం నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డికి పార్టీ హై కమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన ఎవరిని లెక్క చేయలేదు. పార్టీ మంచి విజయం సాధించి పట్టు నిలుపుకోవాల్సిన సమయంలో నేతల మధ్య విభేదాలు పెరుగుతుండడం పై హై కమాండ్ ఆందోళన చెందింది. ఇటువంటి తరుణంలో రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డిని టిడిపి అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడం నిజంగా సాహసమే. ఎందుకంటే కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పట్టు సాధించడానికి ఆ కుటుంబమే కారణం. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. టిడిపి నేతల ఒత్తిడికి చంద్రబాబు తలొగ్గాల్సి వచ్చింది.
* అత్యంత క్లిష్ట సమయంలో బాధ్యతలు..
రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి( Srinivas Reddy ) టిడిపి పగ్గాలు తీసుకొని చాలా ఏళ్లు అవుతోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అత్యంత క్లిష్ట సమయంలోనే ఆయన అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన గత ఐదేళ్లకు పైగా ఆ పదవిలో ఉన్నారు. టిడిపి అధ్యక్ష బాధ్యతలు అంటేనే ఎవరు ముందుకు రాని రోజుల్లో నేనున్నాను అని ముందుకొచ్చి ఆ బాధ్యతలు స్వీకరించారు. అయితే కూటమి గెలిచిన తర్వాత టిడిపి నేతలతో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. సహజంగానే చంద్రబాబుపై ఈ విషయంలో ఒత్తిడి పెరిగింది. అందుకే ఆయన స్థానంలో భూపేష్ రెడ్డిని నియమించారు చంద్రబాబు. ఆయన బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వయానా అన్న కొడుకు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి టిడిపిలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అవుతానని భావించి బిజెపిలో చేరారు. కానీ ఆయన అన్న కుమారుడు టిడిపిలోని కొనసాగుతూ వచ్చారు. 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు టిడిపి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి అంత సిద్ధం చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో బిజెపితో పొత్తు కుదరడంతో ఆ సీటు ఆ పార్టీకి వెళ్ళింది. బాబాయ్ కోసం ఆ సీటు వదులుకున్నారు భూపేష్ రెడ్డి. కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనకు టిడిపి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు చంద్రబాబు. అయితే అదే అధ్యక్ష పదవి కోసం రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి వ్యతిరేకులు ప్రయత్నించారు. చివరకు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయాన్ని తీసుకుని భూపేష్ రెడ్డిని నియమించినట్లు తెలుస్తోంది.