Undavalli Arun Kumar : ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే.. అనే గేయం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఎంతో ప్రాచుర్యం పొందింది కూడా. అయితే ఏపీలో రాజకీయ నేతగా ఉంటూ విశ్లేషకుడిగా మారిన ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలు అలానే ఉంటాయి అనేది ఒక కామెంట్. తాను నిష్పక్షపాతంగా మాట్లాడుతానని చెబుతారు. కానీ ఆయన మాటల వెనుక ఏదో పరమార్థం ఉంటుంది. మనసులో రాజకీయంగా ఎవరికో మంచి చేయాలన్న భావన కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఆయన మాటలు తీసుకుంటే అలానే ఉంటాయి. 2014 నుంచి 19 మధ్య పాలించిన చంద్రబాబు కాలంలో ఆయన విశ్లేషణలు ఒకలా ఉండేవి. 2019 నుంచి 2024 మధ్య జగన్ పాలించినప్పుడు ఆయన చేసిన విశ్లేషణలు మరోలా ఉండేవి. చివరికి ఆయన నోటి నుంచి వచ్చే మాట చంద్రబాబు వ్యతిరేకత.. జగన్మోహన్ రెడ్డి అనుకూలత కనిపించేదని విశ్లేషకుల మాట. తాజాగా ఆయన ఏపీలో పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ గురించి ప్రత్యేక ప్రస్తావన తెచ్చారు. తద్వారా తన కడుపులో ఉన్న మంటను బయటపెట్టారు.
* పెద్ద ఎత్తున పెట్టుబడులు..
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. స్వయంగా అంతర్జాతీయ సంస్థలు ఆ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖకు భారీగా పెట్టుబడులు వస్తుండడం అందరూ చూస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రాబోతోంది. దానికి అనుబంధంగా చాలా ఐటి పరిశ్రమలు కూడా రానున్నాయి. మరోవైపు రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. పరిశ్రమల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇటువంటి సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
* పెట్టుబడులపై మాట్లాడుతూ..
సమకాలీన రాజకీయ అంశాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటారు మీడియాతో. ఇటువంటి తరుణంలో ఏపీలో పరిశ్రమల గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. పండ్లు కొరుకుతూ మాట్లాడుతున్నట్టు దమ్ము ఉంటే చంద్రబాబు హెరిటేజ్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో పెట్టించండి చూస్తాం అంటూ సవాల్ చేశారు. ఉన్నఫలంగా ఆయనకు అమరావతిపై ప్రేమ పుట్టుకు వచ్చింది. గత ఐదేళ్ల వైసీపీ కాలంలో కనీసం అమరావతి గురించి మాట్లాడలేదు. అమరావతిని పీక నులిమి చంపే ప్రయత్నం చేస్తే ఈయనకు కనిపించలేదు. ఇప్పుడు కొత్తగా అమరావతిపై ప్రేమ ఒలకబోస్తున్నారు. ఆయన మాటలు చూస్తుంటే దురుద్దేశపూర్వకంగానే కనిపిస్తున్నాయి.
* హెరిటేజ్ ను తేవాలని సవాల్..
సమకాలీన అంశాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ కు విపరీతమైన పట్టు ఉంది. అది కాదనలేని సత్యం కూడా. విశాఖ తో పాటు ఏపీకి వస్తున్న పరిశ్రమలు.. తమ విస్తరణలో భాగంగా వస్తున్నాయే తప్ప కొత్తగా పెట్టడం లేదు. ఇలా ఏపీకి వస్తున్న పరిశ్రమలను చూసి దేశంలో ఇతర ప్రాంతాల వారు కూడా హర్షిస్తున్నారు. చివరకు ఏపీలో వైసీపీ తప్ప ఇతర పార్టీల నేతలు కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ ఒక్క ఉండవల్లి అరుణ్ కుమార్ కు మాత్రం ఇది నచ్చడం లేదు. హెరిటేజ్ అనేది ఇప్పటికే ఏపీలో విస్తరించింది. కానీ దాని ప్రధాన కార్యాలయం అమరావతికి తెమ్మని సలహా ఇస్తున్నారు ఉండవల్లి. అంటే ఏపీకి వస్తున్న పరిశ్రమలు ఇతర ప్రాంతాల్లో పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేసి రమ్మన్నట్టుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.