Jagan Assembly Strategy : ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు వేడిగా ఉన్నాయి. ముఖ్యంగా టీటీడీ లడ్డూ కు సంబంధించి కల్తీ వ్యవహారం పైన ఎక్కువగా వాదనలు కొనసాగుతున్నాయి. సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత.. ఈ వ్యవహారం మరింత ముదిరింది. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని తేలిందని వైసీపీ చెబుతుండగా.. కల్తీ జరిగింది కదా అని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. బాధ్యులపై చర్యలకు ఏక సభ్య కమిషన్ ను నియమించింది. ఇంకోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హెరిటేజ్ పై పడింది. ఇండాపూర్ డైరీ తో లింకులు పెడుతూ.. హెరిటేజ్ ను టార్గెట్ చేసింది. ముఖ్యంగా శాసనమండలిలో అదే అంశంపై చర్చించాలని పట్టుబడుతోంది. జగన్మోహన్ రెడ్డి సైతం మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
* సభలో చర్చ..
ఏపీ అసెంబ్లీలో( AP assembly) నెయ్యి కల్తీ అంశంపై చర్చించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై కొద్ది రోజులుగా చర్చ నడిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రచ్చ నేపథ్యంలో అసెంబ్లీలో నెయ్యి కల్తీ పై చర్చించాలని కూటమి భావిస్తోంది. ఇప్పటికే దీనిపై మంత్రుల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాళ్లు వెళ్లాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి హాజరైతే ఈ అంశంపైనే చర్చిద్దామని.. పూర్తి ఆధారాలతో కల్తీ వ్యవహారాన్ని బయటపెడతామని కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం, ఆపై మండలి చైర్మన్ పదవి ఉండడంతో రచ్చ చేస్తోంది. దానిని అధిగమించాలంటే శాసనసభలో చర్చించడమే ఉత్తమమని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం..
ప్రభుత్వ వ్యూహం ఇలా ఉంటే.. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సైతం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఒకవేళ సభలో నెయ్యి కల్తీ విషయంపై చర్చిస్తే మాత్రం సభకు హాజరయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి గట్టి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హెరిటేజ్ విషయంలో మరింతగా పట్టు పట్టాలని ఆదేశించినట్లు సమాచారం. అవసరం అనుకుంటే తాను సభకు హాజరవుతానని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్సీలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అధికార పార్టీకి కావాల్సింది అదే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సభకు హాజరైతే మాత్రం ముప్పేట టార్గెట్ చేసే అవకాశం ఉంది. అయితే జగన్ అంతవరకు తెచ్చుకుంటారా? అనేది ఒక అనుమానం.