Jagan And Vijayasai Reddy: విజయసాయి రెడ్డి( Vijaya Sai Reddy) విషయంలో జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? వైసీపీలోకి రీఎంట్రీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నారా? అసలు వైసీపీ అధినేత మదిలో ఏముంది? సాయి రెడ్డి విషయంలో ఎలాంటి ఆలోచనతో ఉన్నారు? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాది నుంచి ఉన్నారు విజయసాయిరెడ్డి. అధినేత కష్టసుఖాల్లో సైతం పాలుపంచుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అహర్నిశలు శ్రమించారు. అటువంటి నేత ఇటీవల పార్టీకి దూరమయ్యారు. ఇంతవరకు ఏ పార్టీలో కూడా చేరలేదు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిని పార్టీలోకి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అటు విజయసాయి రెడ్డికి, ఇటు జగన్మోహన్ రెడ్డికి మధ్య సన్నిహితంగా ఉన్న రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే విజయసాయిరెడ్డి పై కొంతమంది నేతల అభ్యంతరం ఉండడంతోనే జగన్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందన్న ప్రచారం నడుస్తోంది.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
వైసిపి ఆవిర్భావంలో పాత్ర..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఆవిర్భావంలో విజయసాయిరెడ్డి పాత్ర స్పష్టంగా ఉంది. సాయి రెడ్డి వైయస్సార్ కుటుంబ ఆడిటర్ గా ఉండేవారు. అలా జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. జగన్ తో పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అవినీతి కేసుల్లో 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు బీజం వేసింది విజయసాయిరెడ్డి అని అప్పట్లో టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు విజయసాయిరెడ్డి. తొలిసారి పార్టీ అధికారంలోకి రాకపోయినా.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా.. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి.. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన హవాను చెలాయించారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితుల్లో బయటకు వెళ్లారు విజయసాయిరెడ్డి.
లాబీయింగ్ చేసే నేత కోసం..
అయితే ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. కూటమి ప్రభుత్వం( alliance government) ఉక్కు పాదం మోపుతోంది. జగన్ చుట్టూ ఉన్న నేతలంతా అరెస్టు అయ్యారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నుంచి సహకారం లేదు. జాతీయ స్థాయిలో సైతం మద్దతు తెలిపేవారు కరువయ్యారు. జాతీయ పార్టీలతో లాబీయింగ్ చేసే నేత కూడా కనిపించకుండా పోయారు. విజయసాయిరెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి సన్నిహిత నేత ఆయనకు గుర్తు చేసినట్లు తెలుస్తోంది. పార్టీలోకి విజయసాయిరెడ్డిని తీసుకొస్తే మంచిదని ఆయన సలహా ఇచ్చినట్లు సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంపై ఏమీ మాట్లాడలేదని తెలుస్తోంది. అయితే ఏదైనా విషయాన్ని ముఖం మీద తేల్చేయడం జగన్ కు ఉన్న అలవాటు. దీంతో విజయసాయిరెడ్డి విషయంలో ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతోంది.
చాలా అభ్యంతరాలు..
అయితే విజయసాయిరెడ్డి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడ సి పోర్టు కేసు విచారణకు హాజరైన ఆయన మాట్లాడిన తర్వాతే.. మద్యం కుంభకోణం కేసులో సిట్ చర్యలను వేగవంతం చేసింది. నేతల అరెస్టు ప్రారంభమైంది. కేవలం విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతోనే ప్రత్యేక దర్యాప్తు బృందం పట్టు బిగించిందన్న అనుమానాలు ఉన్నాయి. అటువంటి నేతను ఎలా పార్టీలోకి తీసుకుంటారని చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి విషయంలో ఎలా అడుగు ముందుకు వేయాలో తెలియడం లేదు. అందుకే తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు ప్రచారం నడుస్తోంది. మొత్తానికి అయితే పరిస్థితులు చూస్తుంటే విజయసాయిరెడ్డి వైసీపీలోకి రీఎంట్రీ ఖాయమని తెలుస్తోంది.