IPL 2026 : బంగారపు హుండీని చిల్లర వేయడానికి ఉపయోగించకూడదు. దానిని ఎటువంటి పనులకు ఉపయోగించాలో తెలిసి ఉండాలి. అలాకాకుండా చిల్లర సేకరించడానికి ఉపయోగిస్తే అంతకుమించిన మూర్ఖత్వం ఉండదు. కానీ ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అలానే చేస్తోంది. ప్లేయర్లను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక.. సతమతమవుతోంది. ముఖ్యంగా కీలకమైన మ్యాచులలో సమర్థవంతమైన ప్లేయర్లకు బాధ్యతలు అప్పగించకుండా వదిలేస్తోంది. ఆ ఫలితాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అనుభవిస్తోంది.
చెన్నై జట్టు గత ఏడాది జరిగిన మెగా వేలంలో 14.2 కోట్లతో ప్రశాంత్ వీర్ అనే కొత్త కుర్రాడిని తీసుకుంది. అతడు ఆల్ రౌండర్. రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేస్తాడని మేనేజ్మెంట్ గొప్పలు పోయింది. కానీ ఇంతవరకు అతనికి అవకాశం దక్కలేదు. బ్యాటర్ గా అతడు తనను తాను నిరూపించుకున్నాడు. అయితే నిన్న బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఆ సమయంలో ప్రశాంత్ కు బంతి ఇచ్చి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
మేనేజ్మెంట్ అతడితో బౌలింగ్ చేయించిన దాఖలాలు కనిపించకపోవడం పట్ల క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ” కోల్ కతా జట్టు మేనేజ్మెంట్ భారీ ధరకు గ్రీన్ ను కొనుగోలు చేసింది. కానీ ఇంతవరకు అతడికి బంతి ఇవ్వలేదు.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోను ప్రశాంత్ ను భారీ ధరకు మేనేజ్మెంట్ కొనుగోలు చేసింది. కానీ ఇంతవరకు అతడికి బౌలింగ్ ఇవ్వలేదు. గ్రీన్ మాదిరిగానే ప్రశాంత్ పరిస్థితి కూడా ఉందని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటివరకు చెన్నై జట్టు బౌలర్లు ఆడిన మూడు మ్యాచ్లలో ప్రభావం చూపించలేకపోయారు. కనీసం బ్యాటర్లను ఇబ్బంది పెట్టే బంతులు కూడా వేయలేకపోయారు. ప్లాట్ పిచ్ ల మీద బంతికి అనుకూలంగా బంతులు వేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు బంతులతో ప్రయోగాలు చేస్తుంటే.. చెన్నై బౌలర్లు మాత్రం గల్లి స్థాయిలో ఆడినట్టుగా బౌలింగ్ వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రశాంత్ తో తదుపరి మ్యాచ్లలో బౌలింగ్ వేయించాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.