India vs South Africa Final : అమ్మాయిలు అదరగొట్టారు.. అచ్చి వచ్చిన ముంబై వేదికగా దుమ్ము రేపారు.. బలమైన దక్షిణాఫ్రికాను బలహీనంగా చేసి చరిత్రలో తొలిసారిగా విశ్వవిజేతగా నిలిచారు. వాస్తవానికి ఈ టోర్నీలో టీమిండియా ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. వరుసగా మూడు మ్యాచ్లలో ఓటమిపాలైంది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓడించిన ఇదే టీమ్ ఇండియా లీగ్ దశలో ఆ జట్టు ముందు ఓటమిపాలైంది. కానీ ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా వరుస విజయాలతో అదరగొట్టింది.
స్వదేశంలో 2023లో వన్డే వరల్డ్ కప్ సాగింది. లీగ్ నుంచి మొదలుపెడితే సెమీస్ వరకు పురుషుల జట్టు వరుస విజయాలు సాధించింది. బలమైన ఆస్ట్రేలియాను సైతం లీగ్ దశలో మట్టి కరిపించింది. అటువంటి భారత జట్టు ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా ఎదుట తడబడింది. కనీసం 250 స్కోర్ కూడా ప్రత్యర్థి ఎదుట టార్గెట్గా ఉంచలేకపోయింది. అప్పటిదాకా బీభత్సంగా బ్యాటింగ్ చేసిన జట్టు.. విపరీతంగా పరుగులు చేసిన జట్టు అలా తడబడిపోవడం సగటు భారత అభిమానికి నచ్చలేదు. ఈ స్కోరును కాపాడుకోవడంలో భారత జట్టు విఫలమైంది. దీంతో స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుతో దారుణమైన పరాభవం ఎదురయింది. పురుషుల జట్టు అలా ఓడిపోవడం సగటు అభిమానికి గుండె కోత మిగిల్చింది.
2023 తర్వాత రెండు సంవత్సరాల విరామం అనంతరం మన దేశం వేదికగా మహిళల వన్డే వరల్డ్ కప్ ను ఐసీసీ నిర్వహించింది. ఈ మెగా టోర్నీకి శ్రీలంక కూడా ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఈ వరల్డ్ కప్ లో టీమిండియా మహిళలు మొదట్లో రెండు విజయాలు సాధించారు. ఆ తర్వాత వరుసగా మూడు ఓటములు ఎదుర్కొన్నారు. తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మళ్లీ విజయాల బాట పట్టారు. సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టును ఓడించారు. రికార్డు స్థాయి చేజింగ్ చేసి ప్రపంచ ఘనతను సృష్టించారు. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు మీద అన్ని రంగాలలో అద్భుతమైన ప్రతిభ చూపించి అదరగొట్టారు.
పిచ్ నుంచి వస్తున్న సహకారాన్ని భారత బ్యాటర్లు.. భారత బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. కీలకమైన దశలో వికెట్లు పడగొట్టి భారత బౌలర్లు సత్తా చూపించారు. షఫాలీ వర్మ అటు బ్యాట్.. ఇటు బంతితో అదరగొట్టింది. దీప్తి శర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్.. అద్భుతమైన బౌలింగ్ తో సంచలనం సృష్టించింది. తద్వారా సుదీర్ఘ నిరీక్షణకు తెరపడి టీం ఇండియాకు వరల్డ్ కప్ సాధ్యమైంది.