US Wars History : అమెరికా.. ప్రపంచానికి పెద్దన్న. చాలా సంవత్సరాలుగా ప్రపంచం మీద పెత్తనం సాగిస్తోంది. తనకు అనుకూలమైన పరిపాలకులు ఉంటే నిశ్శబ్దంగా ఉంటుంది. ఒకవేళ ఆ పరిపాలకులు తనకు నచ్చకపోతే అంతర్యుద్ధం మొదలుపెడుతుంది. ఏదో ఒక విషయాన్ని సాకుగా చూపించి.. తన ప్రయోజనాల కోసం పాకులాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రకృతి వనరులను దోచుకుపోతుంది. తనకు ఇష్టం వచ్చిన రోజులు అన్ని విషయాలలో వేలు పెట్టి.. మొత్తంగా దోపిడి పర్వాన్ని దర్జాగా సాగిస్తూ ఉంటుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థకు.. సామ్రాజ్యవాదానికి.. దోపిడి చేసే తీరుకు అమెరికా బలమైన నిదర్శనం. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిరియా ఫ్లోర్స్ ను బంధించారని వార్తలు వస్తున్నాయి. వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సి రోడ్రిగ్స్ అన్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. “అమెరికా భారీ సైనిక దాడుల తర్వాత మదురో బంది అయ్యాడని” ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అమెరికా బాంబులతో దాడి చేసి మదురో ను బలవంతంగా దేశం బయటికి పంపించిందని.. ప్రపంచానికి తెలియకుండా దాచేసిందని వార్తలు వస్తున్నాయి. కరేబియన్ సముద్రం, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా దళాలు మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న పడవలపై దాడులు చేశాయి. ఆ తర్వాత ఊహించని విధంగా అమెరికా విమానాలు దాడులు చేశాయి. దీంతో పరిణామాలు మారిపోయాయి.
అమెరికా గిట్టని పరిపాలకుల మీద దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. 1989లో అమెరికా పనామా మీద దాడి చేసింది. పనామాలో అమెరికన్ పౌరుల రక్షణ, అ ప్రజాస్వామిక పద్ధతులు, అవినీతి, మాదకద్రవ్యాల వ్యాపారం వంటి వ్యవహారాలను కారణాలు చూపిస్తూ అమెరికా దాడి చేసింది. పనామా అధ్యక్షుడు మ్యాన్యుయేల్ నోరిగా ను పదవీచ్యుతుడిని చేసింది. ఈ దాడికి ముందు నోరిగా మీద అమెరికా అనేక ఆరోపణలు చేసింది. ఆ తర్వాత దాడులు మొదలుపెట్టింది. వియత్నాం పై యుద్ధం తర్వాత.. ఆ కాలంలో అమెరికా చేసిన అతి పెద్ద దాడి ఇదే. నోరిగా ను ముందు అమెరికా జైలుకు తరలించారు. 2010 వరకు అతడిని అక్కడే ఉంచారు. ఆ తర్వాత మరో విచారణ ఎదుర్కోవాలని ఫ్రాన్స్ దేశానికి అప్పగించారు. అనంతరం ఒక సంవత్సరం తర్వాత అతడిని పనామాకు అప్పగించారు. కాగా, నోరిగా 2017 వరకు జైలులో శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత అతడు అదే జైలులో చనిపోయాడు.
బాగ్దాద్ ప్రాంతంలో సామూహిక విధ్వంసకర ఆయుధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అమెరికా నేతృత్వంలోని దళాలు ఇరాక్ దేశం మీద దండయాత్ర సాగించాయి. 2003 డిసెంబర్ 13న సద్దాం హుస్సేన్ ను అమెరికా దళాలు బంధించాయి. 1980లో ఇరాక్ ఇరాన్ యుద్ధం జరిగింది. ఆ సమయంలో నోరిగా మాదిరిగానే సద్దాం హుస్సేన్ కూడా అమెరికాకు మిత్రుడుగా ఉన్నాడు. అయితే ఎటువంటి ఆధారాలు లేకుండానే అతడు ఆల్ ఖైదా వంటి సాయుధ గ్రూపులకు మద్దతు ఇచ్చాడని అమెరికా ఆరోపించింది. ఇరాక్ లో ఎప్పుడూ సామూహిక విధ్వంస ఆయుధాలు కనిపించలేదని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అమెరికా దళాలు దాడులు చేస్తున్న నేపథ్యంలో సద్దాం తన స్వస్థలమైన తిక్రిత్ సమీపంలోని ఓ బంకర్ లో దాక్కున్నాడు. ఆ తర్వాత అతని బయటికి తీసి.. జైల్లో వేశారు. డిసెంబర్ 30, 2006న అతడిని ఉరి తీశారు.
అమెరికా దళాలు 2022 ఫిబ్రవరిలో హెండురాస్ ప్రాంతానికి చెందిన మాజీ అధ్యక్షుడు హెర్నాండేజ్ ను పట్టుకున్నాయి. తెగుసిగల్పా ప్రాంతంలో అతడు తన ఇంట్లో పట్టుబడ్డాడు. ఏప్రిల్ 2022లో అవినీతి, అక్రమ మాదకద్రవ్యాలు వ్యాపారంలో అతని ప్రమేయం ఉందని ఆరోపణలు వినిపించాయి. దీంతో అతడిని అమెరికాకు రప్పించారు. ఆ తర్వాత అదే ఏడాది జూన్లో అతనికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే 2025 డిసెంబర్ 1న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెర్నాండేజ్ కు క్షమాపణ చెప్పారు. కొద్దిరోజుల తర్వాత హెండూ రాస్ అత్యున్నత ప్రాసిక్యూటర్ హెర్నాండేజ్ పై అంతర్జాతీయ అరెస్టు వారెంట్ జారీ చేశాడు . అమెరికా జైలు నుంచి మాజీ అధ్యక్షుడు విడుదలైన కొద్ది రోజులకే ఇలాంటి అరెస్టు వారెంట్ జారీ కావడం తీవ్రమైన గందరగోళానికి దారితీసింది.