Harshit Rana : వడ్డించే వాళ్ళలో మనవాడు గనుక ఒకడు ఉంటే.. బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే ఇబ్బంది ఉండదు అంటారు. ఇప్పుడు టీమిండియాలో కోచ్ గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. కొంతమంది ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాడు. ఇంకొంతమంది ఆటగాళ్లకు ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదు. అవకాశాలు వచ్చిన ప్లేయర్లలో కొందరు సద్వినియోగం చేసుకుంటే.. ఇంకొందరు ప్రతిభ చూపించకపోయినప్పటికీ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక మిగతా వారైతే టన్నులకొద్దీ ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు.
టీమిండియాలో గత కొంతకాలంగా సుస్థిరంగా స్థానం సంపాదించుకుంటున్న ప్లేయర్ల జాబితాలో హర్షిత్ రాణా ముందు వరుసలో ఉన్నాడు. కొన్ని సందర్భాలలో గిల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ.. వంటి వారిని దూరం పెడుతున్న మేనేజ్మెంట్.. హర్షిత్ రాణా విషయంలో మాత్రం విపరీతమైన ఉదారత చూపిస్తోంది. దీనంతటికీ ప్రధాన కారణం గౌతమ్ గంభీర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పైగా, హర్షిత్ రాణా ను గౌతమ్ గంభీర్ అనేక సందర్భాలలో వెనకేసుకుని వచ్చాడు.
గౌతమ్ గంభీర్ చలవ వల్ల హర్షిత్ స్థిరంగా స్థానాలు సంపాదించుకుంటున్నాడు. తద్వారా భారీగానే సంపాదిస్తున్నాడు. సంపాదన పెరగడంతో అతడు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. ఇటీవల అతడు అత్యంత ఖరీదైన లంబోర్ఘని కారులో కనిపించాడు. నారింజ రంగులో ఉన్న ఆ కారు నుంచి దిగిన అతడు విమానాశ్రయానికి వెళ్లిపోయాడు. దీనిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియాలో లంబోర్ఘని ఉరుస్ సిరీస్ కారును అతడు నడిపాడు. ఇప్పటికే అతడు బీఎండబ్ల్యూ లో 5 సిరీస్ కారును కొనుగోలు చేశాడు. ఇప్పుడు కొత్తగా అతడి గ్యారేజీలోకి లంబోర్ఘని కారు చేరినట్టు తెలుస్తోంది. టీమిండియా మాజీ సారధి రోహిత్ శర్మ కు నారింజ రంగు లంబోర్ఘని కారు ఉంది. అతడి గతంలోనే ఆ కారును నడుపుకుంటూ ముంబై వీధులలో సందడి చేశాడు. ఆ కారుకు 3015 అనే నెంబర్ రిజిస్ట్రేషన్ చేయించాడు.
హర్షిత్ కు వరుసగా అవకాశాలు రావడం.. అనేక రకాలైన వాణిజ్య ప్రకటనలలో నటించడంతో ఆదాయం పెరిగిందని తెలుస్తోంది. అందువల్లే ఇంతటి ఖరీదైన కారును కొనుగోలు చేసినట్టు సమాచారం. లంబోర్ఘని కారు ధర కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది.. ఈ కారు భూమ్మీద ఉన్న వాహనాలలో అత్యంత విలాసవంతమైందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతుంటారు. ఏది ఏమైనప్పటికీ గౌతమ్ గంభీర్ తోడ్పాటు వల్ల హర్షిత్ ఒక లంబోర్ఘనికి యజమాని అయ్యాడు.