Operation Sindoor : గత ఏడాది జమ్ము కాశ్మీర్ లో పహల్గాం ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటకం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. చాలామంది జమ్ము కాశ్మీర్ వెళ్లడాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో ఆదాయం లేక చాలామంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పహల్గాం ఘటన తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది. అన్ని ఆధారాలు తెలుసుకున్న తర్వాత పాకిస్తాన్ మీద వ్యూహాత్మకంగా దాడి చేసింది. ఒక్క ప్రాణం కూడా పోకుండా.. పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. తద్వారా ఉగ్రవాద శిబిరాలు నేల కూలాయి. ఈ ఘటన పాకిస్తాన్ దేశంలో వణుకు పుట్టించింది. ఏం చేయాలో తెలియక ఉగ్రవాదులు పలాయనం చిత్తగించారు. ఉగ్రవాదులకు తీవ్రస్థాయిలో నష్టం జరగడంతో పాకిస్తాన్ వేరే పల్లవి అందుకుంది. ఉగ్రవాదుల శిబిరాల మరమ్మతుల కోసం ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేసింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ వ్యవహరించిన తీరు ప్రపంచ దేశాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే సమయంలో భారత్ అమెరికా సహాయం కోరింది. భారత్ చేసిన దాడులను నిలుపుదల చేయాలని పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకుంది. అమెరికా అధికారులు, చట్ట సభ్యులు, మీడియా సంస్థలతో పాకిస్తాన్ రాయబారులు, రక్షణ అధికారులు సంప్రదింపులు జరిపారు. ఏకంగా 50కి పైగా సమావేశాలు నిర్వహించారు. దీనికి సంబంధించి జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది.
“ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు చుక్కలు కనిపించాయి. నష్టం తీవ్రంగా ఉండడంతో ఏం చేయాలో ఆ దేశ పరిపాలకులకు అర్థం కాలేదు. ఒకవైపు మేకపోతు గాంభీర్యం నటించారు. కానీ వాస్తవ పరిస్థితి వేరు. అందువల్లే పాకిస్తాన్ రాయబారులు అమెరికా కాళ్లు పట్టుకున్నారు. చివరికి ఎలాగోలా బయటపడ్డారని” ఎన్డి టీవీ తన కథనంలో ప్రస్తావించింది. ఈ కథనం ద్వారా పాకిస్తాన్ కు యుద్ధం చేయడం కాదు కదా, యుద్ధాన్ని తట్టుకునే సత్తా కూడా లేదని తేలిపోయిందని జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.