Hardik Pandya : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత బలమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు ఈ జట్టు ట్రోఫీలు అందుకుంది. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు. గతంలో ఇతడు గుజరాత్ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. ప్రారంభ సంవత్సరంలోనే గుజరాత్ జట్టు విజేతగా నిలవడంలో పాండ్యా కీలకపాత్ర పోషించాడు. ఆ తదుపరి సంవత్సరంలో కూడా గుజరాత్ ఫైనల్ దాకా వెళ్ళింది. అయితే ఓటమిపాలైంది.
హార్దిక్ పాండ్యా నాయకత్వ పటిమను చూసిన ముంబై జట్టు యాజమాన్యం అతడిని కొనుగోలు చేసింది. 2024 నుంచి అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. 2024లో హార్థిక్ పాండ్య నాయకత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అతడి మీద రోహిత్ శర్మ అభిమానులు బహిరంగంగానే విమర్శలు చేశారు. రోహిత్ శర్మ భార్య కూడా విమర్శలు చేసినప్పటికీ.. ఆ తర్వాత సోషల్ మీడియాలో తన పోస్ట్ ను డిలీట్ చేసింది. 2024లో ముంబై జట్టు అంత గొప్పగా ఆడలేదు. గత ఏడాది ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది.
ఈ ఏడాది ముంబై జుట్టు ప్రయాణం అంత గొప్పగా సాగడం లేదు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా నాయకత్వం తీరుపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హార్దిక్ పాండ్యా వైఖరి వల్లే వరుస వైఫల్యాలు ఎదురవుతున్నాయని శతగోపన్ రమేష్ ఆరోపించారు. హార్థిక్ పాండ్యా వ్యూహాలను ఆయన పూర్తిగా తప్పు పట్టారు. ముఖ్యంగా బుమ్రా ను వినియోగించుకోవడంలో హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమవుతున్నాడని మండిపడ్డారు. రోహిత్, సూర్య కుమార్ యాదవ్ తో విభేదాలు ఉన్నాయని.. అవి ఇటీవల ముంబై తలపడిన మ్యాచ్లలో కనిపించాయని రమేష్ ఆరోపించారు.
“నాయకుడిగా పాండ్యా గొప్ప వ్యూహాలను అమలు చేయాలి. మైదానంలో జట్టు పరిస్థితికి అనుగుణంగా అప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. పాండ్యా వైఖరి వల్ల ముంబై జట్టు అటువంటి ఫలితాలను అనుభవిస్తుంది. ఇప్పటికైనా పాండ్యా తన తీరు మార్చుకోవాలని” రమేష్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పాండ్యా ఆట తీరు పట్ల రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి.