Rain Alert : తెలంగాణలో ఆదివారం వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో 8 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతోపాటు, గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
ఈ జిల్లాలకు అలర్ట్..
ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలో మూడు రోజులు వాతావరణ చల్లబడుతుందని ప్రకటించింది. అదే సమయంలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. కొన్ని జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే రోజు రోజుకు వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దీంతో ఉదయం ఎండగా ఉంటూ.. సాయంత్రం అయ్యే సరికి వానలు కురుస్తున్నాయి. తాజా నివేదిక ప్రకారం ఆదివారం(ఏప్రిల్ 21న) రాష్ట్రంలోని కరీంనగర్, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, కామారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల, నాగర్‌కర్నూరల్, జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తాయని ప్రకటిచింది.
ఏడు రోజులు వానలు..
ఈ 8 జిల్లాలతోపాటు రాబోయే 7 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో వడగండ్లు కురుస్తాయని వెల్లడించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
రైతుల ఆందోళన..
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఛాయలు నెలకొన్నాయి. నీరందక చాలా జిల్లాల్లో యాసంగి పంటలు ఎండిపోయాయి. ఇప్పుడు చివరి దశలో ఉన్న పంటలపై వడగండ్ల వానలు పడితే చేతికి వచ్చిన గింజలు నోటికి అందకుండా పోతాయని పేర్కొంటున్నారు. పంట పూర్తికాక, వాతావరణ శాఖ హెర్చరికలతో ఇనఫలంగా కోయలేక ఇబ్బంది పడుతున్నారు. మామిడి రైతులు కూడా చేతికి వచ్చిన కాయలు రాలిపోతాయని ఆందోళన చెందుతున్నారు.