Pawan Kalyan reaction : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయడం లేదు. ఇంకా అవే దూషణలతో రెచ్చిపోతున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి దారుణ వ్యాఖ్యలు చేశారు గుడివాడ అమర్నాథ్. మేకప్ మంత్రి అనేసారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణ దళిత మహిళ.. ఆపై ఉపాధ్యాయురాలు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. అటువంటి మహిళను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడంపై గుడివాడ అమర్నాథ్ తీరును తప్పుపడుతున్నారు. కానీ గుడివాడ అమర్నాథ్ మాత్రం తాను విధానపరమైన విమర్శలు చేశానని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించినట్లు తెలుస్తోంది. నాయకులు తాము ఆడే ప్రతి మాట బాధ్యతగా ఆడాలని ఇతవు పలికారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ పాలసీ నచ్చకపోతే ఆ విధానంలో ఉన్న లోపాలను నిశితంగా విమర్శించాలి కానీ.. వ్యక్తిగత జీవితాలపై బురద జల్లడం దారుణమన్నారు. మహిళల కట్టూ బొట్టు పై మాట్లాడే స్థాయికి రాజకీయ నాయకులు దిగజారి పోవడం దారుణమని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలను గట్టిగానే తిప్పికొట్టాలని కూటమినేతలకు పిలుపునిచ్చారు. పౌర సమాజం హర్షించే భాషను మాత్రమే వినియోగించాలని కూటమి పార్టీల నాయకులను సూచించారు పవన్ కళ్యాణ్.
* అప్పట్లో బూతులు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రులు ఏ స్థాయిలో మాట్లాడేవారు తెలియంది కాదు. నీ అమ్మ మొగుడా అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు కొడాలి నాని. అంటే తండ్రిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసేవారు. మధ్యలో తల్లి ప్రస్తావన కూడా తెచ్చేవారు. గతంతో పోల్చితే రాజకీయాల్లో బూతు పదాలు తగ్గుతాయి అని భావించారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడం, పెద్దగా ప్రజా మద్దతు లేకపోవడంతో వెనక్కి తగ్గుతారని భావించారు. కానీ నేతలు శృతిమించి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు అయితే నడిరోడ్డుపై సీఎం చంద్రబాబుపై తిట్ల దండకం అందుకున్నారు. మహిళా నేత రోజా సైతం వెనక్కి తగ్గడం లేదు. రోజు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ విషయంలో సైతం అదే మాదిరిగా వ్యవహారం నడిచింది. ఒక దళిత మహిళ, ఆపై ఉపాధ్యాయురాలుగా చేసిన మహిళ, ఈ రాష్ట్రానికి హోం శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న వంగలపూడి అనిత పై ఆ తరహా వ్యాఖ్యలు చేయడం పై మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
* కూటమి నేతలకు సూచన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను హెచ్చరించే క్రమంలో కూటమి నేతలకు సైతం కీలక సూచనలు చేశారు. అవతలి వారు సంస్కారహీనంగా మాట్లాడినంత మాత్రాన కూటమికి అలాంటి అలవాట్లు అవసరం లేదంటూ గట్టిగా వ్యాఖ్యానించారు. మనం మాట్లాడే ప్రతి మాట హుందాగా ఉండాలని స్పష్టం చేశారు. వారు చేసిన తప్పులను, అసభ్య ప్రసంగాలను పదేపదే జనాలలో ఎండగట్టడమే మన మొదటి కర్తవ్యం అని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఘటన తప్పకుండా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే దళిత మహిళపై ఈ స్థాయి ఆరోపణలు చేయడం పై ఆవర్గంలో కూడా చర్చ ప్రారంభం అయింది. అయితే తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని గుడివాడ అమర్నాథ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి కూడా.
