Madan Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ కు, ఆయన పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొంతమంది హస్తం కండువా కప్పుకోగా.. చాలామంది ఆ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చాలావరకు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ఇంకా మిగతా మున్సిపాలిటీలను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి తహతలాడుతోంది. ఇవన్నీ భారత రాష్ట్ర సమితికి తీవ్ర ప్రతిబంధకంగా మారాయి. మరోవైపు కెసిఆర్ కుమార్తె ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటూ అరెస్టయ్యారు. 10 రోజుల కస్టడీ ముసినప్పటికీ ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మరో 14 రోజులపాటు కస్టడీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్ని వరుస షాక్ ల మధ్య కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగలనుందని సమాచారం.
సొంత జిల్లాలో..
కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో ఆయనకు గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ కు ఆయన సొంత స్నేహితుడు షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆయనకు అత్యంత దగ్గర స్నేహితుడు, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి భారత రాష్ట్ర సమితిని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఆయన పార్టీ అధిష్టానం పై ఆగ్రహం గా ఉన్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోవడంతో.. ఆయన కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నాయకులతో ఆయన టచ్ లోకి వెళ్లారు.. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని మదన్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్ మదన్ రెడ్డికి కాకుండా సునీతా లక్ష్మారెడ్డి కేటాయించారు. అప్పటినుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే మదన్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని అప్పట్లో కేసీఆర్ అన్నారు. కానీ కేసీఆర్ అంచనా వేసినట్టుగా భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాలేదు. దీంతో అటు ఎమ్మెల్యే పదవి లేక, క్యాడర్ చెల్లా చెదురవుతుంటే చూడలేక మదన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
చాలామంది లైన్లో..
ఇప్పటికే భారత రాష్ట్ర సమితి చెందిన కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి కొందరు అదే వరుసలో ఉన్నారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా గాంధీభవన్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తహతహలాడుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 20 మందికి పైగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనేది మున్ముందు రోజుల్లో తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.