Mekatothi Sucharita: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల అనంతరం చాలామంది నేతలు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరుతున్నారు. రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం తమ పదవులను వదులుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది నేతలపై ఊహాగానాలు వస్తున్నాయి.మాజీమంత్రి మేకతోటి సుచరిత పై ఇదేవిధంగా వార్తలు వచ్చాయి.ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం సాగింది.కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఆమె తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు కాదని..తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత రాజకీయంగా కూడా సైలెంట్ అయ్యారు.జగన్ పర్యటనలో కూడా ఎక్కడ కనిపించలేదు.దీంతో ఆమె తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం ప్రారంభమైంది. గుంటూరు జిల్లాలో వైసీపీ కీలక నేతల్లో ఆమె ఒకరు.ఇప్పటికే చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు.ఇదే వరుసలో సుచరిత పేరు వినిపించింది.కానీ ఆమె మనసు మార్చుకున్నారు. అధినేత జగన్ తో భేటీ అయ్యారు.తన అనారోగ్య కారణాలతో రాజకీయాల్లో కొనసాగలేనని స్పష్టం చేశారు. అయితే కొంతకాలం ఆగి నిర్ణయం తీసుకోవాలని జగన్ సూచించారు.అయినా సరే తనకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని..తాను ఏ పార్టీలో చేరడం లేదని..రాజకీయాలనుంచి మాత్రమే వైదొలుగుతున్నట్లు వెల్లడించారు.తాడికొండలో తన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని కోరారు.
* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో..
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు మేకతోటి సుచరిత.2009లో తొలిసారిగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి గెలిచారు.2012లో వైసీపీలోకి వచ్చారు.ఉప ఎన్నికను ఎదుర్కొన్నారు.ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.కానీ 2014లో మాత్రం ఓడిపోయారు.2019లో వైసీపీ గెలిచేసరికి జగన్ క్యాబినెట్లో కీలకమైన హోం శాఖను దక్కించుకున్నారు.మంత్రివర్గ విస్తరణలో ఆమెను తొలగించారు.అప్పటినుంచి మనస్థాపంతో ఉన్నారు.తన సొంత నియోజకవర్గ ప్రత్తిపాడు కాదని ఈ ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేయించారు జగన్.ఇష్టం లేకపోయినా పోటీ చేశారు సుచరిత.దారుణంగా ఓడిపోయారు.
* జనసేనలో చేరతారని ప్రచారం
మొన్న ఆ మధ్యన సుచరిత జనసేన లో చేరతారని ఎక్కువగా ప్రచారం సాగింది. ఈ మేరకు చర్చలు కూడా పూర్తయ్యాయని టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సైతం సుచరిత పార్టీని వీడుతారని టాక్ నడిచింది.అయితే ఇప్పుడు ఏకంగా రాజకీయాలనుంచి వైదలుగుతానని సుచరిత ప్రకటించడం విశేషం. ఏ పార్టీ నుంచి ఆహ్వానం లేకపోవడం వల్లే ఆమె రాజకీయాల నుంచి వైదొలగాల్సి వచ్చిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.