Sharmila And Jagan: జగన్ తోనే షర్మిల.. ఏదో జరిగింది.. కూటమి సర్కార్ పై ఇంత ఫైట్ వెనుక కారణమదేనా?

ఏపీలో ఈ నెల నుంచి విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి.వైసిపి హయాంలో జరిగిన తప్పుకు ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది రాష్ట్ర ప్రభుత్వం.సర్దుబాటు చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు.కానీ జగన్ పై విమర్శలు కొనసాగించారు.

Written By: Dharma, Updated On : November 8, 2024 10:47 am

Jagan And Sharmila

Follow us on

Sharmila And Jagan: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల యూటర్న్ తీసుకున్నారు.ఇప్పటివరకు ఆమె వైసీపీతో పాటు జగన్ పై వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వచ్చారు.ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడారు కూడా.అయితే ఉన్నట్టుండి ఆమె రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఏకంగా లాంతరు పట్టుకుని నిరసన తెలిపారు.విజయవాడ నగరంలో ర్యాలీ నిర్వహించారు.ఇది ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల.తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు.అనుకున్న స్థాయిలో రాణించ లేకపోవడంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించింది. అది మొదలు ఆమె వైసీపీతో పాటు జగన్ పై విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో జగన్ కు ఎంత నష్టం చేయాలో అంతలా చేసేశారు. ఇప్పటికీ వైసీపీ నే టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై పడ్డారు. సర్దుబాటు పేరిట భారీగా చార్జీలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు షర్మిల. సామాన్యుడు ఎలా బతికేది అంటూ లాంతరు చేతపట్టి కూటమి సర్కార్ పై నిరసన గళం వినిపించారు.

* తొలిసారిగా విమర్శలు
తొలిసారిగా చంద్రబాబు సర్కార్ పై ఘాటుగా విమర్శలు చేశారు షర్మిల. నిరసన సందర్భంగా ఆమె మాట్లాడుతూ..’వైసిపి హయాంలో 35 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదేవిధానాన్ని అమలు చేస్తోంది.ఇప్పటికే 17 వేల కోట్లు భారాన్ని మోపారు.వైసీపీకి,కూటమికి తేడా ఏమీ లేదు. ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు. ఇది వైసీపీ చేసిన పాపం అంటున్నారు. నాలుగు రూపాయలు పడే యూనిట్ ధర ఎనిమిది రూపాయల పెట్టారట అని ధ్వజమెత్తారు.

* ఇప్పటికీ అదే ధోరణి
అయితే కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసే క్రమంలో జగన్ పై తన విమర్శల పరంపర కొనసాగించారు షర్మిల.అక్రమంగా హిందూజా లాంటి కంపెనీలకు చెల్లించిన విషయాన్ని ప్రస్తావించారు. తప్పు జగన్ ది అయితే ప్రజలపై మాత్రం భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్దుబాటు చార్జీల పేరుతో 40% అధికంగా వసూలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు షర్మిల. వైసిపి పై వ్యతిరేకతతో ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపారని.. అటువంటి ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో భారం మోపడం తగదని చంద్రబాబు సర్కార్ కు ఇతవు పలికారు. వైసిపి తప్పు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకోండి.. కానీ ప్రజలపై భారం మోపకండి అంటూ చంద్రబాబు సర్కార్కు డిమాండ్ చేశారు. మొత్తానికైతే షర్మిల స్వరంలో మార్పు స్పష్టంగా కనిపించింది. అయితే కూటమి సర్కార్ పై నిరసన వ్యక్తం చేస్తూ.. జగన్ పై విమర్శలు చేయడం విశేషం.