MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి దాదాపు పది రోజులు పూర్తయింది. ఇప్పటికే ఆమెను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారించారు. బెయిల్ కోసం సోదరుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత ఆ మధ్య పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై మంగళవారం ఢిల్లీలోని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. దీంతో కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వకపోగా.. ఈడీ కోరుకున్నట్టు 14 రోజుల పాటు కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ 14 రోజులపాటు కవిత జ్యూడిషల్ రిమాండ్ లో ఉంటారు. మార్చి 26 నుంచి 9 వరకు ఆమె రిమాండ్లో కొనసాగుతారు. కోర్టు నిర్ణయం ప్రకారం కవితను తీహార్ జైలుకు అధికారులు పంపించారు. జుడిషియల్ రిమాండ్ అనంతరం ఏప్రిల్ 9 ఉదయం 11 గంటలకు కవితను అధికారులు కోర్టు ఎదుట హాజరు పరుస్తారు. అయితే ఏప్రిల్ 1న మరోసారి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తన కుమారుడికి వార్షిక పరీక్షలు ఉన్న నేపథ్యంలో కవిత మధ్యంతర బెయిల్ కోరినట్టు సమాచారం. అయితే ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సమాధానం ఇచ్చేందుకు కొంత సమయం కావాలని ఈడీ కోర్టును కోరిందని తెలుస్తోంది. వాస్తవానికి కవితను కస్టడీకి ఇవ్వడం ఇది మూడోసారి. ఆమెను అరెస్టు చేసిన తర్వాత వారం రోజులు కస్టడీకి తరలించారు. ఆ తర్వాత మరో మూడు రోజులపాటు ఆమెను కస్టడీలోనే ఉంచారు. ఇప్పుడు ఏకంగా 14 రోజులపాటు కవిత కస్టడీలో ఉండనున్నారు.
కస్టడీతోనే ఈడి ఆగడం లేదు
కవితను కస్టడీకి తీసుకోవడంతోనే ఈడీ ఆగడం లేదు. లిక్కర్ కేసులో దర్యాప్తును మరింత వేగం చేసింది. కవిత బంధువు మేకా శరణ్ ను విచారిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి శరణ్ ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు హైదరాబాదులో శరణ్ ఇంటి పై దాడి చేసి, సోదరులు నిర్వహించారు. ఈ సందర్భంగా శరణ్ ఎవరో తనకు తెలియదని కవిత చెప్పినట్టు తెలుస్తోంది. అధికారులు పదేపదే అడిగినప్పటికీ కవిత నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని సమాచారం. శరణ్ ఇంట్లో సోదాల నేపథ్యంలో కీలకమైన సమాచారం లభించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి..శరణ్ బ్యాంకు లావాదేవీలు, వ్యాపారాలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
కవిత సంచలన వ్యాఖ్యలు
మరో వైపు కోర్టుకు వచ్చే ముందు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కడిగిన ముత్యాల లాగా బయటికి వస్తానని ప్రకటించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసని పేర్కొన్నారు. నన్ను తాత్కాలికంగా జైలులో పెట్టినప్పటికీ.. భయపడేది లేదు.. స్వచ్ఛంగా బయటికి వస్తానని కవిత ప్రకటించారు. తప్పు చేయనప్పుడు నేను భయపడనని, అప్రూవర్ గా ప్రకటించారు. ఈ కేసులో ఒక నిందితుడు బిజెపిలోకి వెళ్ళగానే స్వచ్ఛంగా మారిపోయాడని కవిత సంచలన ఆరోపణలు చేశారు. రెండవ నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బిజెపి టికెట్ ఇచ్చిందని, మూడవ నిందితుడు 50 కోట్లు ఇవ్వగానే అతనిపై ఎటువంటి అభియోగాలు లేవని కవిత సంచలన ఆరోపణలు చేశారు. కవితను కోర్టు ఎదుట హాజరు పరిచిన తర్వాత.. ఈడీ అధికారులు కూడా పలు ఆరోపణలు చేశారు. కవిత విచారణకు సహకరించడం లేదని.. పదేపదే చెప్పినప్పటికీ ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈడి అధికారులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటివరకు కొంత సమాచారం సేకరించామని.. ఇంకా లోతుగా సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉందని ఈడి అధికారులు పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్, కవితను కలిపి విచారిస్తేనే అసలు విషయాలు వెలుగు చూస్తాయని ఈడి అధికారులు ప్రకటించారు.