దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. తాజాగా 30 వేల దిగువనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 15,92,421 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 29,616 మందికి పాజిటివ్ గా తేలింది. ముందు రోజుతో పోల్చి కేసులు 5 శాతం మేర తగ్గాయి. నిన్న 28 వేల మంది కోలుకున్నారు. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉన్నాయి. నిన్న మరో 290 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కొత్తగా నమోదైన కేసుల్లో 17,983 కేరళలోనే ఉన్నాయని పేర్కొన్నది. రాష్ట్రంలో నిన్న 127 మంది మరణించారని వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 71,04,051 మందికి వ్యాక్సినేషన్ చేశామని, దీంతో ఇప్పటి వరకు మొత్తం 84,89,29,160 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.
మొత్తం కేసులు 3.36 కోట్లకు చేరగా.. రికవరీలు 3.28 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం మూడు లక్షల మందికిపైగా కొవిడ్ తో బాధపడుతున్నారు. క్రియశీల రేటు 0.90 శాతానికి చేరింది. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 4.46 లక్షలుగా ఉంది. నిన్న 71 లక్షల మందికి టీకా అందింది. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 84.89 కోట్లకు చేరింది. కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతున్నాయి. ఏపీలో హెచ్చుతగ్గులు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి గతంలో కంటే ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం 300 లోపు వస్తున్నాయి.