
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా రెండు లక్షలకు దిగువన నమోదయ్యాయి. కరోనా మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. నిన్న 4వేలకు పైగా మరణాలు నమోదవగా.. కొత్తగా నాలుగువేలకు దిగువన రికార్డయ్యాయి. మరోవైపు పెద్ద సంఖ్యలో బాధితులు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,96,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 3,511 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. 24 గంటల్లో 3,26,850 బాధితులు డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,69,48,874కు పెరగ్గా.. 2,40,54,861 మంది బాధితులు కోలుకున్నారు.