BRS Donations : బెంగాల్లో మమతకు.. తమిళనాడులో స్టాలిన్ కు, ఏపీలో చంద్రబాబుకు.. అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి ఎవరికీ చేతకాలేదు. వాళ్ల వల్ల కాలేదు.. వాస్తవానికి కుటుంబ పార్టీలలో.. కనివిని ఎరుగని స్థాయిలో ట్రెండ్ సృష్టించారు కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు తన పార్టీని ఏకంగా జాతీయస్థాయిలో నిలబెట్టాలని ప్రయత్నం చేశాడు. గాలి మోటార్ లో దేశ మొత్తం తిరిగాడు. అసలు ప్రతిపక్ష కూటమికి తానే ఫండింగ్ చేస్తానని చెప్పాడు. అటువంటి కెసిఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కు పరిమితమయ్యాడు. బిడ్డను పార్టీ నుంచి బయటికి పంపించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు.. పార్లమెంట్ ఎన్నికలు 0 ఫలితాలు.. అంతే ఇప్పుడు కారు పార్టీని దేకే వాడు లేడు. ఈ మాట అంటున్నది మేం కాదు. ఎన్నికల సంఘానికి స్వయంగా భారత రాష్ట్ర సమితి ఇచ్చిన రిపోర్టు.
2023 -2024 కాలానికి భారత రాష్ట్ర సమితికి ఏకంగా 580.52 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి.. ఇందులో ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే భారత రాష్ట్ర సమితికి 495.52 కోట్లు వచ్చాయి. ఇందులో ప్రడెంట్ ఎలక్టో రల్ ట్రస్టు ద్వారా ఏకంగా 85 కోట్లు లభించాయి. 2022 -23 సంవత్సరానికి సంబంధించి భారత రాష్ట్ర సమితికి 683.06 కోట్లు వచ్చాయి. ఇందులో బాండ్ల రూపంలో 529 కోట్లు, ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 90 కోట్లు.. వివిధ వ్యక్తుల నుంచి 64.3 కోట్లు వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు.. పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలు రావడంతో కారు పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో కారు పార్టీ దారుణంగా బోల్తా పడింది. దీనికి తోడు ఆ పార్టీ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆ పార్టీని పెద్దగా పట్టించుకునే వారు లేకుండా పోయారు. 2024 -25 లో పార్టీకి 15,09,08,141 మాత్రమే వచ్చాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.. ఇప్పుడు గులాబీ పార్టీ అధికారంలో లేకపోవడంతో.. కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. అజ్ఞాత వ్యక్తులు విరాళాలు ప్రకటించడం లేదు.. రాజ్యసభ సభ్యత్వం పొందినవారు.. ఇంకా అనేక రకాల మేళ్ళు పొందినవారు పార్టీని పట్టించుకోవడం లేదు. అందువల్లే గులాబీ పార్టీకి విరాళాలు ఏకంగా 97 శాతానికి పడిపోయాయి.
గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విరాళాలు ఇవ్వడానికి కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. నాయకులు కూడా పోటీపడ్డారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ మాదిరిగా భారత రాష్ట్ర సమితి అధికారిక ఖాతా నిండుగా ఉండేది. నిత్యం డబ్బులు రాకతో కళ కళ లాడుతూ కనిపించేది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కెసిఆర్ వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు. పార్టీ మొత్తం కేటీఆర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. కల్వకుంట్ల కవిత బయటికి వెళ్లిపోయింది. ఒకవేళ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి సానుకూల ఫలితం రాకపోతే పరిస్థితి మరో విధంగా ఉంటుంది.