Indian Cricket Team : ఒక ఆటగాడు ప్రతిభ వెలుగులోకి రావాలంటే ముందు అతడు తనను తాను నిరూపించుకోవాలి. అలా నిరూపించుకోవడానికి డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆస్ట్రేలియా నుంచి మొదలుపెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి క్రికెట్ యాజమాన్యం కూడా ఈ పద్ధతిని అనుసరిస్తుంది. ఆస్ట్రేలియా జట్టు టెస్ట్ ఫార్మాట్లో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంది అంటే దానికి ప్రధాన కారణం.. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించిన ప్లేయర్లను.. అంతర్జాతీయ టోర్నీలకు ఎంపిక చేయడం.. అందువల్లే ఆస్ట్రేలియా జట్టు చాలా సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది.
డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపిస్తున్న ప్లేయర్లకు మిగతా దేశాలతో పోల్చి చూస్తే.. భారత దేశంలో అంతగా అవకాశాలు లభించడం లేదు. డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి.. అందులో సత్తా చూపించాలి.. అలాంటి వారికి అవకాశాలు లభిస్తాయని బీసీసీఐ పెద్దలు చెబుతున్నప్పటికీ.. అవి కార్యరూపం దాల్చడం లేదు. సెంచరీలు కొట్టినప్పటికీ.. వికెట్లు తీసినప్పటికీ.. అవకాశాలు లభించకపోవడంతో ప్లేయర్లు నిరాశ పడుతున్నారు. అవకాశాలు లభించనిచోట డొమెస్టిక్ క్రికెట్ ఎందుకు ఆడాలని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ హజారే టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ ఏకంగా ఐదు మ్యాచ్లలో నాలుగు సెంచరీలు చేశాడు. అయినప్పటికీ అతడికి న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్లో అవకాశం లభించలేదు. మరో యువ ఆటగాడు రుతు రాజ్ గైక్వాడ్ కు లిస్ట్ ఏ క్రికెట్లో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో ఒక శతకం కూడా చేశాడు. అయినప్పటికీ అతడికి న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్లో అవకాశం లభించలేదు. ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో ఇతడు సెంచరీ కూడా చేశాడు. మీరు మాత్రమే కాదు దృవ్ జూరెల్, సర్ఫ రాజ్ ఖాన్ వంటి వారు అదరగొడుతున్నప్పటికీ.. జాతీయ జట్టులో అవకాశాలు మాత్రం లభించడం లేదు.
బ్యాటరీ మాత్రమే కాదు బౌలర్లు కూడా దేశవాళీ క్రికెట్ టోర్నీలలో సత్తా చూపిస్తున్నారు. మహమ్మద్ షమీ డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చూపిస్తున్నప్పటికీ అతనికి అవకాశాలు ఇవ్వడం లేదు. ఉత్తర ప్రదేశ్ జట్టుకు చెందిన అన్సారి, మహారాష్ట్ర పేస్ బౌలర్ రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ మీడియం పేస్ బౌలర్ సత్యనారాయణ రాజు వంటి వారు విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగి బౌలింగ్ చేస్తున్నప్పటికీ జాతీయ జట్టులో అవకాశం లభించడం లేదు.
ప్రస్తుతం జాతీయ జట్టులో హర్షిత్ రాణా కు వరుసగా అవకాశాలిస్తున్నారు. వాస్తవానికి అతని బౌలింగ్ కొన్ని సందర్భాలలో చూసుకుంటే దారుణంగా ఉంటుంది. అత్యంత ఘోరంగా పరుగులు ఇస్తుంటాడు. అటువంటి వ్యక్తికి వరుసగా అవకాశాలు వస్తున్న వేళ.. మిగతా ప్లేయర్లకు మొండి చేయి చూపించడం అత్యంత బాధాకరం. క్రికెట్లో కేవలం 11 స్థానాలు మాత్రమే ఉంటాయి. వాటి కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. అలాంటప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే ప్రశ్న వ్యక్తం కావచ్చు. అలాంటప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడించడం ఎందుకు? సత్తా చూపిస్తున్న ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెట్టడం ఎందుకు? ఈ ప్రశ్నలకు బీసీసీఐ కచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.