India A vs Bangladesh A : గెలవాల్సిన మ్యాచ్.. చేతులారా ఓడిపోయారు. అది కూడా అత్యంత బలహీనమైన బంగ్లాదేశ్ చేతిలో తలవంచారు. వాస్తవానికి ఫస్ట్ బౌలింగ్లో.. ఆ తర్వాత బ్యాటింగ్లో.. చివర్లో సూపర్ ఓవర్ లో.. ఇలా ప్రతి అంశం లోను టీమిండియా దారుణమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. గెలవాల్సిన సెమీఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి.. అది కూడా బంగ్లాదేశ్ ఎదుట తలవంచి ఇజ్జత్ మొత్తం తీసుకుంది.
ఆసియా కప్ రైసింగ్ స్టార్ టోర్నీలో భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఏ, ఇండియా ఏ జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ హాబీబుర్ రహమాన్ 65, చివర్లో మహేరూబ్ 48* పరుగులు చేశారు. గుర్జ్ ప్రణీత్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ చివరి రెండు ఓవర్లలో ఏకంగా 50 పరుగులు చేయడం విశేషం. 19 ఓవర్లో 28, 20 ఓవర్లో 22 పరుగులు చేయడంతో ఆ స్కోర్ చేసింది.
195 పరుగుల లక్ష్యంతో రంగంలో దిగిన టీమిండియా కు ఓపెనర్లు మెరుగైన భాగస్వామ్యం అందించారు. వైభవ్ సూర్య వంశీ 38, ప్రియాంష్ ఆర్య 44 పరుగులు చేసి.. అదరగొట్టారు. వీరిద్దరు తొలి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం అందించారు. వీరిద్దరు అవుట్ అయిన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ కుదుపులకు గురైంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ పకడ్బందీగా బౌలింగ్ వేసింది. దీంతో టీమ్ ఇండియా మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఈ దశలో వచ్చిన జితేష్ శర్మ 33, నేహల్ వదేరా 32 పరుగులు చేసి టీమిండియా విజయం వైపు నడిపించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ అవుట్ కావడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ దశలో రమన్ దీప్ సింగ్(17), అశుతోష్ శర్మ (13) పరుగులు చేశారు. అయితే చివరి బంతికి టీమిండియా విజయానికి 4 పరుగులు కావలసిన సమయంలో హర్ష్ దూబే మూడు పరుగులు మాత్రమే చేయడంతో రెండు జట్ల స్కోర్లు సమానమయ్యాయి. దీంతో మ్యాచ్ ” సూపర్” పోరుకు వెళ్ళింది.
సూపర్ ఓవర్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోవడంతో.. సూపర్ ఓవర్ నిబంధనలు ప్రకారం ఒక్క పరుగు కూడా చేయకుండానే ఆల్ అవుట్ అయింది. జితేష్, అసుతోష్ వరుస బంతులలో అవుట్ కావడంతో టీమిండియా ఒక పరుగు కూడా చేయకుండానే ఆల్ అవుట్ అయింది. ఈ దశలో ఒక పరుగు లక్ష్యంతో రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ తొలి బంతికి యాసిర్ అలీ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. మరో బంతిని సూర్యాంష్ వైడ్ గా వేయడంతో బంగ్లాదేశ్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ టోర్నీలో ఫైనల్ లోకి ప్రవేశించింది. పాకిస్తాన్ చేతిలో లీగ్ దశలో ఓడిపోయిన తర్వాత టీమిండియా ఒమన్ జట్టుపై అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి కప్ ఆశలను చేజార్చుకుంది.
SUPER OVER BETWEEN INDIA AND BANGLADESH IN THE EMERGING ASIA CUP. pic.twitter.com/us1ffHZR9I
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 21, 2025