టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుక్కకు ఉన్న విలువ పేదోళ్ల ప్రాణాలకు లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, వరదలతో లక్షలాది ఎకరాలు పంట నష్టపోయి, ఆస్తి నష్టమై రైతులు, జనం అల్లాడుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కిలోమీటర్ కో బార్…బీర్ అంటూ మద్యంపై ఉన్న ధ్యాస పేదోడి కన్నీళ్లు తుడవడంపై లేదని విమర్శించారు. పరాయివాడు తప్పు చేస్తే పొలిమేర వరకు తరిమికొట్టాలి…మనోడు తప్పు చేస్తే పాతరేయాలన్న కాళోజీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ….‘తప్పు చేస్తున్న కేసీఆర్ ను ఏం చేయాలి. ఓటుతో పాతరేయాలా? వద్దా?’’అని ప్రశ్నించారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 13వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు మధ్యాహ్నం చౌట్ కూర్ మండల కేంద్రంలో హాజరైన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు మాజీమంత్రి బాబూ మోహన్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, ఏనుగు రవీందర్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, బొడిగె శోభ, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, రాకేశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, యువ నాయకుడు ఉధయ్ బాబూ మోహన్, జిల్లా ఇంఛార్జీ జయశ్రీ , మండలాధ్యక్షులు శేఖర్ తదితరులు హాజరయ్యారు.