రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి సహాయకులుగా ఉండేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్లను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్, అతడి స్నేహితులు గదిలో నిర్బంధించి, మత్తుమందిచ్చి వారంరోజులు సామూహిక అత్యాచారం చేశారు. తన తల్లి, పిన్ని కనిపిచడం లేదంటూ బాధితురాలి కుమారుడు ఓ రేడియోగ్రాఫర్ ను నిలదీయంగా ఎక్కడున్నారో చూద్దామంటూ ఆసుపత్రి అంతా కలియతిప్పాడు. ఓ చోట శరీరంపై అరకొర దుస్తులతో అపస్మారక స్థితిలో ఉన్న పిన్ని కనిపించింది. అమెను మహబూబ్ నగర్ కు తీసుకువెళ్లారు. జరిగిన దారుణాన్ని అక్కడ ఆమె వివరించింది. దాంతో సోమవారం స్థానిక పోలీసులకు తెలిపారు. హైదరాబాద్ లోనే ఫిర్యాదు చేయాలని చెప్పడంతో చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమామహేశ్వర్ తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార బాధితుల్లో మరో బాధితురాలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.