ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు జోరుగా సాగుతాయన్నది బహిరంగ రహస్యమే. అయితే.. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కులానికి చెందినదిగా ముద్రవేసుకోవడానికి ఇష్టపడదు. అందరి ఓట్లూ దక్కితేనే.. విజయం సిద్ధిస్తుంది మరి, కానీ.. ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. తెలుగు దేశం పార్టీ కమ్మ సామాజికవర్గానికి చెందినది, వైసీపీ రెడ్డి వర్గానికి చెందినదనే ఫీలింగ్ మెజారిటీ జనాల్లో ఏర్పడింది. ఇక, జనసేన పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందినదని కూడా ఒక భావన ఏర్పడింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు కూడా.. ఈ ప్రచారానికి పరోక్షంగా కారణమయ్యాయి. కమ్మ సామాజిక వర్గాన్ని వైసీపీ టార్గెట్ చేస్తోందని బహిరంగంగానే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని తరలింపు వంటి అంశాలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు ఒకవిధమైన ఆందోళనలో ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఇటు చూస్తే.. వారి పార్టీగా చెప్పుకునే టీడీపీ.. అధికార పార్టీని ఢీకొనే పరిస్థితిలో లేదు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా? అంటే.. అవును అని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరతీశాయి.
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పవన్ చాలా విషయాలు మాట్లాడారు. ఇందులో.. ఏపీలోని కుల రాజకీయాల ప్రస్తావన కూడా తెచ్చారు. రాష్ట్రంలో కుల రాజకీయాలు జోరుగా సాగుతున్నాయని అన్నారు. ఇవాళ ఒక సామాజిక వర్గం మీద కక్షగట్టి దాడిచేస్తే.. రేపు అధికారంలోకి వచ్చిన వారు మరో కులం మీద కక్షగట్టరా? అని ప్రశ్నించారు పవన్. ఇలాంటి రాజకీయాలు సరికాదని అన్నారు.
పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు కమ్మ సామాజిక వర్గానికి సాంత్వన చేకూర్చిందని అంటున్నారు. ఎవరు కాదన్నా.. పవన్ కు జనాల్లో విశేషమైన ఆదరణ ఉంది. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదన్నట్టుగా.. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ప్రజల మధ్యనే ఉంటూ రాజకీయాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి.. వచ్చేసారి పరిస్థితులు మారే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పవన్ టైం పాస్ రాజకీయాలు చేయట్లేదనే విషయంలో ఏకాభిప్రాయం వచ్చిందని కూడా అంటున్నారు. కాబట్టి.. తెలుగుదేశం పార్టీ డీలా పడిపోయిన నేపథ్యంలో.. పవన్ వెంట కమ్మ సామాజిక వర్గం నడిచినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
జనసేనాని కూడా ఇదే ఆలోచనతో ఉన్నారని అంటున్నారు. తాను కేవలం కాపువర్గ నేతగా మిగిలిపోవాలని భావించట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాందెండ్ల మనోహర్ ను ఉంచుకోవడంలో ఆంతర్యం కూడా ఇదేనని చెబుతున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని బలపరిచాయని అంటున్నారు. మరి, రాబోయే రోజుల్లో కమ్మ, కాపు బంధం ఏ స్థాయిలో బలపడుతుందో చూడాలి.