ATM Cash Withdrawal Safety Tips: భారతదేశంలో నగదు రహిత లావాదేవీలు చాలా పెరిగాయి. అయినా కూడా నగదు అవసరాల కోసం ఇప్పటికీ చాలా మంది ఏటీఎంలను ఉపయోగిస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. స్కిమ్మింగ్, కార్డ్ ట్రాపింగ్, షోల్డర్ సర్ఫింగ్, హిడెన్ కెమెరాల ద్వారా పిన్ నంబర్లు దొంగిలించడం వంటి మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చిన్న నిర్లక్ష్యం కూడా బ్యాంక్ ఖాతాలోని డబ్బు మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఇలాంటి మోసాల నుంచి రక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిలో ముఖ్యమైన ఈ ఐదింటి గురించి తెలుసుకుందాం..
స్కిమ్మింగ్, కార్డ్ ట్రాపింగ్ అంటే ఏమిటి?
ఈ రకమైన చీటింగ్ లో మోసగాళ్లు ఏటీఎం కార్డ్ స్లాట్ వద్ద ప్రత్యేక పరికరాలను అమర్చి కార్డ్ వివరాలను కాపీ చేస్తారు. ఆ సమాచారంతో నకిలీ కార్డులు తయారు చేసి ఖాతాదారుల డబ్బును దోచుకుంటారు. మరోవైపు కార్డ్ ట్రాపింగ్‌లో కార్డ్‌ను ఏటీఎం మిషన్‌లోనే ఇరుక్కుపోయేలా చేస్తారు. బాధితుడు వెళ్లిపోయిన తర్వాత కార్డ్‌ను తీసుకుని దుర్వినియోగం చేస్తారు. అలాగే షోల్డర్ సర్ఫింగ్ ద్వారా పక్కనే నిలబడి లేదా కెమెరాల సహాయంతో పిన్ నంబర్‌ను గమనిస్తారు.అయితే ఇలాంటి వాటి నుంచి ఈ విధంగా సురక్షితంగా ఉండాలి.
1. ఏటీఎం మిషన్‌ను పరిశీలించండి:
ఏటీఎంలో కార్డ్ పెట్టే ముందు ఒకసారి మిషన్‌ను జాగ్రత్తగా గమనించడం చాలా ముఖ్యం. కార్డ్ స్లాట్ లూజ్‌గా ఉందా, కీప్యాడ్‌పై అదనపు కవర్‌లు లేదా అనుమానాస్పద పరికరాలు ఉన్నాయా? మిషన్ చుట్టూ చిన్న కెమెరాలు అమర్చారా? అనే విషయాలను పరిశీలించాలి. ఏదైనా అనుమానం కలిగితే ఆ ఏటీఎంను ఉపయోగించకుండా వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇవ్వాలి.
2. పిన్ టైప్ చేసేటప్పుడు జాగ్రత్త:
ఏటీఎం ఉపయోగిస్తున్నప్పుడు అత్యంత ముఖ్యమైన భద్రతా చర్య పిన్ నంబర్‌ను గోప్యంగా ఉంచడం. పిన్ ఎంటర్ చేసే సమయంలో మరో చేతిని కీప్యాడ్‌పై అడ్డుగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల పక్కనున్న వ్యక్తులు లేదా హిడెన్ కెమెరాలు పిన్‌ను గుర్తించే అవకాశం ఉండదు. ఎంత సురక్షితమైన ప్రాంతమైనా ఈ అలవాటును తప్పనిసరిగా పాటించాలి.
3. సురక్షితమైన ఏటీఎంలనే:
బ్యాంక్ శాఖల సమీపంలో ఉండే, సీసీటీవీ నిఘా మరియు భద్రతా సిబ్బంది ఉన్న ఏటీఎంలను ఉపయోగించడం మంచిది. జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలు, చీకటిగా ఉండే ప్రదేశాల్లోని ఏటీఎంలను వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. భద్రతా సౌకర్యాలు ఉన్న కేంద్రాల్లో మోసాలకు అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ట్రాన్సాక్షన్ అలర్ట్స్‌ను యాక్టివ్‌గా ఉంచండి:
బ్యాంక్ ఖాతాకు సంబంధించిన SMS లేదా మొబైల్ యాప్ నోటిఫికేషన్ అలర్ట్స్ తప్పనిసరిగా ఆన్ చేసుకోవాలి. ఖాతాలో జరిగే ప్రతి లావాదేవీపై వెంటనే సమాచారం అందుతుంది. అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపిస్తే ఆలస్యం చేయకుండా బ్యాంక్‌ను సంప్రదించి కార్డ్‌ను బ్లాక్ చేయించవచ్చు. ఇలా చేయడం వల్ల పెద్ద మొత్తంలో నష్టం జరగకుండా అడ్డుకోవచ్చు.
5. అపరిచితుల సహాయం తీసుకోవద్దు:
ఏటీఎంలో కార్డ్ ఇరుక్కుపోయినా, మిషన్ సరిగా పనిచేయకపోయినా అక్కడ ఉన్న అపరిచితుల సహాయం తీసుకోవడం ప్రమాదకరం. కొన్నిసార్లు మోసగాళ్లు సహాయం చేస్తున్నట్లు నటించి కార్డ్ వివరాలు, పిన్ నంబర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం లేదా సమీప బ్రాంచ్‌ను సంప్రదించడం ఉత్తమ మార్గం.
