
ఏపీలో కొవిడ్ ఆస్పత్రుల హెల్ప్ డెస్కుల పనితీరుపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ప్రత్యేక దృష్టి పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా హెల్ప్ డెస్కుల్లో సమాచారం అందడం లేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై మంత్రి ఆరా తీశారు. జిల్లా యంత్రాంగం, డీఎంహెచ్ వో, డీసీహెచ్ ఎస్ సూపరింటెండెంట్ లతో మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 24 గంటల పాటు కొవిడ్ ఆస్పత్రుల్లో షిప్ట్ పద్ధతిలో సిబ్బందిని నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్ సీ వైద్యుడు ఎన్. భాస్కర్ రావు చికిత్సకు రూ. 1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. సీఎం సహాయనిధి నుంచి సాయం చేస్తున్నట్లు ఆళ్లనాని తెలిపారు.